Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావాలని చేయను.. కథే నడిపిస్తుంది!

కావాలని చేయను.. కథే నడిపిస్తుంది!

Tupaki.com 4 days ago

భావోద్వేగపూరిత ప్రేమకథలను, మనుషుల మధ్య ఉండే మానసిక సంఘర్షణలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ ది ప్రత్యేక శైలి. `జబ్ వి మెట్`, `లవ్ ఆజ్ కల్` వంటి క్లాసిక్ లవ్ స్టోరీస్ అందించిన అలీ `రాక్‌స్టార్`, `తమాషా`, `హైవే`, `అమర్ సింగ్ చమ్కీలా` వంటి చిత్రాలలోనూ హృదయ విదారక అర్ధాంతరంగా ముగిసిపోయే ముగింపులను చూపించారు.

ఈ నేపథ్యంలో తన చిత్రాలలో తరచూ కనిపించే ఈ ట్రాజిక్ ఎండింగ్స్‌పై ఇంతియాజ్ అలీ తాజాగా స్పందించారు. ఇలాంటి ముగింపులేవి తాను కావాలని ప్లాన్ చేయనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మై వాపస్ ఆవుంగా` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఇంతియాజ్ అలీ మీడియా మీట్ లో ఈ విషయాన్ని రివీల్ చేసారు.

`నేను కావాలని అలా చేయను. అది కథా గమనంలో సహజంగానే జరిగిపోతుంది. మన వృత్తిలో మనం చేసే చాలా పనులు ముందుగా ప్లాన్ చేసినవి కావు. నేను రాసే స్క్రిప్టులు లేదా తీసుకునే నిర్ణయాలు కేవలం నా మేధస్సు తో మాత్రమే గైడ్ చేయబడవు. ఆ కథలే నన్ను నడిపిస్తున్నట్లు అవే రాయబడుతున్నట్లు నాకు అనిపిస్తుంది` అని ఇంతియాజ్ స్పష్టం చేశారు. ఇంతియాజ్ అలీ సినిమాల్లోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మన పక్కన ఉండే వ్యక్తుల లాగే కనిపిస్తాయి. అందుకే ఆ పాత్రలకు ఎదురయ్యే కష్టాలు, వారి జీవితాల్లోని ముగింపులు ప్రేక్షకులను తీవ్రంగా వెంటాడుతుంటాయి.

`రాక్‌స్టార్` లో హీరో జోర్డాన్ ఆవేదన, `చమ్కీలా` లోని విషాదకర నిజ జీవిత సంఘటనలు ఇందుకు నిదర్శనం. ఒక దర్శకుడిగా కథ చెప్పేటప్పుడు కమర్షియల్ హంగుల కోసం బలవంతంగా హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఆ కథకు ఉండే ప్రాణమే పోతుందని అందుకే కథ ఏ ముగింపును కోరుకుంటే దానినే తాను తెరపై చూపిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మ్యూజిక్ లెజెండ్ రెహమాన్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాము ఎప్పుడూ ఒక ఫార్ములాను నమ్ముకుని కూర్చోమని, కథ, దర్శకుడి విజన్ ఆధారంగానే లోతుల్లోకి వెళ్లి సరికొత్త ట్యూన్స్‌ను, లిరిక్స్‌ను రాబడతామని చెప్పారు.

అదే మ్యాజిక్ `మై వాపస్ ఆవుంగా లోనూ రిపీట్ కాబోతోందని హింట్ ఇచ్చారు. `మై వాపస్ ఆవుంగా` దేశ విభజన నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. రెండు వేర్వేరు టైమ్‌లైన్స్‌లో సాగే ఈ కథలో వర్సటైల్ యాక్టర్ నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తుండగా పంజాబీ స్టార్ సింగర్ కమ్ యాక్టర్ దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. `అమర్ సింగ్ చమ్కీలా` ఘన విజయం తర్వాత ఇంతియాజ్ అలీ - దిల్జిత్ దోసాంజ్ కాంబినేషన్‌లో వస్తోన్న రెండవ ప్రాజెక్ట్ కావడంతో చిత్రంపై బాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu