Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కట్టుబాట్లకు లొంగని వాడికి ఇండియా తలవొంచదు.. టెస్లాకు గుణపాఠం!

కట్టుబాట్లకు లొంగని వాడికి ఇండియా తలవొంచదు.. టెస్లాకు గుణపాఠం!

Tupaki.com 4 days ago

ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం టెస్లా భారతదేశంలో అడుగుపెడుతుందని ఆశించిన ట్రేడ్ వర్గాలకు కోలుకోలేని షాక్ తగిలింది. భారత్‌లో తయారీ కేంద్రాన్ని నిర్మించబోవడం లేదని టెస్లా అధికారికంగా స్పష్టం చేయడంతో గత ఐదేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ చర్చలకు తెరపడింది.

ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధికారికంగా ధృవీకరించారు. అయితే ఈ నిష్క్రమణ వెనుక కేవలం పన్నుల వివాదమే కాకుండా... కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా అనేక అంతర్గత వ్యాపార సమీకరణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి 2021 నుండి టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడానికి తీవ్రంగా ప్రయత్నించింది. తక్కువ దిగుమతి సుంకాలతో కార్లను ఇండియాకు పంపి ఇక్కడి డిమాండ్‌ను పరీక్షించాలని ఎలోన్ మస్క్ భావించారు. కానీ ముందుగా ఇక్కడే ప్లాంట్ నిర్మించాలని భారత ప్రభుత్వం పట్టుబట్టింది. చివరికి రూ. 30 లక్షల (35,000 డాలర్లు) కంటే ఎక్కువ ధర ఉన్న ఈవీ కార్లపై దిగుమతి సుంకాన్ని 110 శాతం నుండి 15 శాతానికి తగ్గించడానికి భారత్ అంగీకరించినా.. అందుకు బదులుగా మూడేళ్లలో కనీసం రూ.4000 కోట్ల (500 మిలియన్ డాలర్ల) మేర స్థానిక పెట్టుబడులు పెట్టాలనే షరతును టెస్లా అంగీకరించలేదు.

ఈ పన్నుల ప్రతిష్టంభన పక్కన పెడితే అసలు కారణాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఈవీ రంగానికి సంబంధించిన సప్లై చైన్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. పారిశ్రామిక మౌలిక వసతులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా టెస్లా కార్ల ధరలు భారతీయ వినియోగదారుల సగటు కొనుగోలు శక్తి కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈ ఆర్థిక గణాంకాలు సరిపోలకపోవడం వల్లే 2024 ఏప్రిల్‌లో మోదీతో జరగాల్సిన సమావేశాన్ని మస్క్ రద్దు చేసుకున్నారు. ఆపై జూలై నాటికి చర్చలను పూర్తిగా పక్కనబెట్టేశారు.

అయితే టెస్లా గ్లోబల్ వ్యూహాన్ని పరిశీలిస్తే... మరో ఆసక్తికరమైన నిజం బయటపడుతుంది. టెస్లాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సొంత ఫ్యాక్టరీలు ప్రస్తుతం కేవలం 60 శాతం సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. అంటే వాటిలోనే 40 శాతం ప్రొడక్షన్ లైన్లు ఖాళీగా ఉండి ధూళి చేరుతున్నాయి. సొంత ప్లాంట్లలోనే ఉత్పత్తి సామర్థ్యం మిగిలిపోయినప్పుడు.. భారతదేశం లాంటి కొత్త మార్కెట్లో భారీ పెట్టుబడితో సరికొత్త ప్లాంట్ పెట్టడం వ్యాపారపరంగా లాభదాయకం కాదని టెస్లా బోర్డు భావించింది. అందుకే పెట్టుబడులు పెట్టకుండా కేవలం బ్రాండ్ ఉనికి కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో షోరూమ్‌ల ద్వారా దిగుమతి చేసుకున్న `మోడల్ Y` కార్లను మాత్రమే విక్రయించనుంది.

మరోవైపు టెస్లా తన ప్రాధాన్యతలను కార్ల తయారీ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ (ఆప్టిమస్ హ్యూమనాయిడ్), అటానమస్ డ్రైవింగ్ (ఎఫ్‌.ఎస్‌.డి) వైపు మళ్లిస్తోంది. ఎక్కువ లాభాలు వచ్చే ఈ విభాగాల వైపు మొగ్గు చూపడం వల్లే మహారాష్ట్రలో ప్లాంట్ ఆలోచనను విరమించుకుంది. భారత్ కూడా టెస్లా కోసం ఆగకుండా టాటా మోటార్స్, మహీంద్రా, చైనాకు చెందిన బీవైడీ (బీవైడి) లతో తన ఈవీ మార్కెట్‌ను వేగంగా విస్తరిస్తోంది. బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాకుండా స్థానిక కట్టుబాట్లకు లొంగి పెట్టుబడులు పెడితేనే భారత మార్కెట్లో మనుగడ సాధ్యమని ఈ ఉదంతం నిరూపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu