Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెరీర్ వర్సెస్ ఫ్యామిలీ: సూపర్‌స్టార్ల రియల్ స్ట్రగుల్స్!

కెరీర్ వర్సెస్ ఫ్యామిలీ: సూపర్‌స్టార్ల రియల్ స్ట్రగుల్స్!

Tupaki.com 1 week ago

సినిమా గ్లామర్ ప్రపంచంలో వెలుగు వెలిగే నటీనటులు నిరంతరం షూటింగులతో ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. వెండితెరపై వారు ఎంతగా అలరించినా.. తెర వెనుక తమ వ్యక్తిగత జీవితాన్ని..

కుటుంబాలను ఎంతగా కోల్పోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన తాజా చిత్రం `కర్తవ్య` ప్రమోషన్లలో భాగంగా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడిగా ఎదిగే క్రమంలో తాను వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించినా.. వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన ఇద్దరు చిన్న కుమారులు తైమూర్, జెహంగీర్ పుట్టిన తర్వాతే జీవితంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో తనకు అర్థమైందని సైఫ్ వెల్లడించారు.

సైఫ్ తన ఇంటిని ఒక `బేస్ క్యాంప్`తో పోల్చడం విశేషం. పర్వతారోహకుడు శిఖరాగ్రానికి చేరుకోవడానికి ఎంత ప్రయత్నించినా తిరిగి వచ్చి సేదతీరడానికి బేస్ క్యాంప్ అవసరమని.. ఒకవేళ పర్వతాల పైనే ఎక్కువ సమయం గడిపితే ఆ బేస్ క్యాంప్ అంతరించిపోయే ప్రమాదం ఉందని విశ్లేషించారు. దీనర్థం కెరీర్ పరుగులో కుటుంబాన్ని విస్మరిస్తే దాని ప్రభావం జీవితాంతం వెంటాడుతుందని సైఫ్ చెప్పకనే చెప్పారు. కన్నవారిని భార్య పిల్లలను విస్మరిస్తే మనకంటూ ఎవరూ మిగలరనేది ఆయన ఉద్ధేశం. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు సాగే షిఫ్టులు.. ఆపై రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం అనేది అసలైన జీవితం కాదని.. అందుకే 2022 నుండి తాను ఏడాదికి కేవలం ఒకే ఒక ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సైఫ్ స్పష్టం చేశారు.

పనిదినాల తగ్గింపు డిమాండ్.. దీపికా పదుకొనేకు చేదు అనుభవం!

ఇండస్ట్రీలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్.. పనివేళల గురించి ఇటీవల గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనే కూడా గట్టిగా గళం విప్పారు. సినిమా సెట్స్‌పై నిరంతరం సాగే 12 గంటల (9 టు 9) షిఫ్ట్ పద్ధతి మానసికంగా, శారీరకంగా నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను కూడా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో 12 గంటల విధానాన్ని మార్చి, కార్పొరేట్ తరహాలో 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ విషయంలో నిర్మాతలు ససేమిరా అనడమే కాకుండా.. షూటింగ్ షెడ్యూల్స్ దెబ్బతింటాయనే నెపంతో తనను కొన్ని ప్రాజెక్టుల నుంచి తొలగించడం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

మరోవైపు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా చాలా సందర్భాలలో తన బిజీ లైఫ్ కెరీర్ కారణంగా కుటుంబంతో విలువైన సమయాన్ని కోల్పోయానని బహిరంగంగానే అంగీకరించారు. స్టార్‌డమ్ వెనుక పరిగెత్తే క్రమంలో పిల్లల ఎదుగుదలను, వారి చిన్ననాటి మధుర క్షణాలను మిస్ అయ్యానని ఆయన గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 60 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన అమీర్ ఇప్పుడు తన కెరీర్ వేగాన్ని తగ్గించి, తన కుమార్తె ఐరా ఖాన్ .. ఇతర కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇటీవల అమీర్ తన మూడవ వివాహం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించి కుటుంబ వ్యవస్థపై తనకు ఉన్న ప్రాధాన్యతను చాటుకున్నారు.

ఈ విధంగా సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, అమీర్ ఖాన్ వంటి అగ్ర తారలందరూ కెరీర్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, చిత్ర పరిశ్రమలో పని వాతావరణం మారాలని కోరుకుంటున్నారు. కోట్లాది రూపాయల సంపాదన.. స్టార్ హోదా ఉన్నప్పటికీ కన్నవారికి, పిల్లలకు సమయం ఇవ్వలేనప్పుడు ఆ విజయాలు నిరర్థకమని వారు భావిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఎంత ఎత్తుకు ఎదిగినా రోజంతా కష్టపడి రాత్రికి ప్రశాంతంగా ఆత్మీయుల మధ్య గడపడమే నిజమైన సంతోషమనే విషయాన్ని ఈ స్టార్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి.

అయితే బాలీవుడ్ స్టార్లతో పోలిస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయడంలో ది బెస్ట్. మహేష్‌, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. వీలున్న ప్రతిసారీ విదేశాలకు ఫ్యామిలీ వెకేషన్లు ప్లాన్ చేయడం, నగరంలో ఉన్నప్పుడు నాణ్యమైన సమయాన్ని భార్య , పిల్లలకు కేటాయించడం చూస్తున్నదే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu