Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మగాడితో పెళ్లి.. వర్షం కోసం 'బ్రోమాన్స్'కి మంగళసూత్రం!

మగాడితో పెళ్లి.. వర్షం కోసం 'బ్రోమాన్స్'కి మంగళసూత్రం!

Tupaki.com 8 hrs ago

శాస్త్రవేత్తలు ఏసీ రూముల్లో కూర్చుని ఎల్‌నినో ప్రభావం.. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, గ్లోబల్ వార్మింగ్ అంటూ ల్యాప్‌టాప్‌లలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తుంటే...

ఒడిశాలోని ఒక గ్రామం మాత్రం "ఇన్ని థియరీలు మాకెందుకు బాబూ... ఇద్దరు మగాళ్లకు పెళ్లి చేస్తే వరుణ దేవుడు ఫ్లాట్ అయిపోయి వర్షం కురిపిస్తాడు!" అంటూ శతాబ్దాల నాటి సూపర్ హిట్ ఫార్ములాను బయటకు తీసింది. అవును మీరు విన్నది నిజమే... వర్షం కోసం ఇక్కడ ఇద్దరు మగాళ్లు పెళ్లి పీటలెక్కారు!

'బ్రోమాన్స్'కి మంగళసూత్రం.. అసలేం జరిగిందంటే?

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి, వర్షాల జాడే లేదు. దీంతో వాతావరణ శాఖ బులిటెన్ల కంటే తమ ఊరి సంప్రదాయమే నయం అనుకున్నారు గ్రామస్థులు. 'అందిర బిబాహ' (మగవారి వివాహం) అనే వినూత్న ఆచారానికి తెరలేపారు. ఈ వింత కళ్యాణ మహోత్సవంలో విశేషాలున్నాయి. వరుడుగా 29 ఏళ్ల జతిన్, వధువు వేషంలో 27 ఏళ్ల కలాండి తయారయ్యారు. బ్యాండ్ మేళాలు, మంగళ వాయిద్యాలు, జీలకర్ర బెల్లం, తాళిబొట్టు, చివరకు ఘుమఘుమలాడే పెళ్లి విందు.. ఒక సాదాసీదా పెళ్లిలో ఉండే హడావుడి అంతా ఇక్కడ జరిగింది. కాకపోతే ఈ పెళ్లి ప్రేమ కోసమో, వంశాభివృద్ధి కోసమో కాదు... వరుణ దేవుడికి పంపిన అర్జెంట్ "రివర్స్ ఇన్విటేషన్ కార్డ్!" అన్నట్టు..

నో హనీమూన్.. ఓన్లీ వర్షం!

ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే... ఈ నూతన వధూవరులు హనీమూన్ ప్లాన్ చేసుకోరు, సంసారమూ పెట్టరు. పెళ్లి జరిగిన మరుసటి రోజే ఇద్దరూ అధికారికంగా విడిపోతారు. ఎందుకంటే ఈ వివాహం జీవితాంతం కలిసి నడవడానికి కాదు... ఆకాశంలో మేఘాలను కలిసి నడిపించడానికి మాత్రమే. శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లతో మేఘాల కదలికలను అంచనా వేస్తుంటే.. వీరు మాత్రం 'పెళ్లి పీటల'తో వాతావరణాన్ని కంట్రోల్ చేయవచ్చని నిరూపించారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల పంచ్‌లు

"వాతావరణ శాఖ డిపార్ట్‌మెంట్‌ను మూసేసి, ఈ గ్రామ పెద్దలకు అప్పగిస్తే బెటర్ ఏమో అంటూ కొందరు.. ఈ వింత పెళ్లి చూసి కన్ఫ్యూజ్ అయిన వరుణ దేవుడు షాక్‌లో వర్షం కురిపించినా ఆశ్చర్యం లేదు.. ఎల్‌నినోకు సైన్స్ కనిపెట్టలేని కొత్త ట్రీట్మెంట్ ఇదన్నమాట!" అంటూ పంచుల వర్షం కురిపిస్తున్నారు..

ఆచారం వెనుక అసలు ఆవేదన

నవ్వుకోవడానికి ఇదొక సెటైరికల్ న్యూస్‌లా అనిపించినా... దీని వెనుక గ్రామస్థుల తీరని ఆవేదన దాగి ఉంది. కాల్వలు ఎండిపోయాయి, తాగడానికి నీరు లేదు.. పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారు. సైన్స్ సమాధానం చెప్పలేనప్పుడు "ఏదో ఒకటి చేస్తే వాన పడకపోతుందా" అనే అమాయకపు నమ్మకమే ఈ ఆచారానికి మూలం.

శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా పూర్వీకుల సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ 'బ్రోమాన్స్' పెళ్లి జరిపించారు. మరి ఈ వినూత్న పెళ్లికి ఇంప్రెస్ అయి వరుణ దేవుడు "రిసెప్షన్ గిఫ్ట్" లాగా వర్షాన్ని కురిపిస్తాడో లేదో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu