Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్ళీ నిర్భయ సీన్ రిపీట్.. బస్సులో మహిళపై దారుణం

మళ్ళీ నిర్భయ సీన్ రిపీట్.. బస్సులో మహిళపై దారుణం

Tupaki.com 1 week ago

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పదమూడేళ్ల అనంతరం నిర్భయ కేసు లాంటి మరో ఉదంతం వెలుగుచూసింది. బస్సులోకి బలవంతంగా లాక్కెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న తనను బస్సులోకి ఎక్కించుకుని డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ ప్రభుత్వంలో తొలిసారిగా ఇటువంటి ఘటన జరగడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. శాంతిభద్రతలను గాలికి వదిలేయడంతోనే మృగాళ్లు రెచ్చిపోతున్నారని విపక్ష పార్టీ ఆమ్ ఆద్మీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

రాజధానిలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు కేసు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటన 13 ఏళ్ల క్రితం నిర్భయ కేసును పోలినట్లు ఉండటంతో మహిళా భద్రతపై మరోసారి విస్తృత చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని పీతంపురంలోని ఒక మురికివాడలో నివసించే బాధితురాలు మంగోలప్పురి ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. మే 11న (సోమవారం) రాత్రి బాధితురాలు తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా, సరస్వతి విహార్ లోని ఓ బస్టాప్ వద్ద నిలిపివుంచిన స్లీపర్ బస్సు సిబ్బంది టైము ఎంత అడిగి ఆమెతో మాటలు కలిపారు. ఆమె సమయం చెప్పేలోగా బస్సులోకి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం సామూహికంగా లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.

దాదాపు 7 కిలోమీటర్ల మేర బస్సును ముందుకు తీసుకువెళ్లి, బస్సు కదులుతుండగానే పలువురు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలియజేసింది. ఈ ఘటన అనంతరం ఆమె తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బస్సు డ్రైవర్, కండెక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. బస్సును సీజ్ చేసినట్లు ప్రకటించారు.

కాగా, ఈ ఉదంతం ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పదమూడేళ్ల క్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ కేసు తరహాలోనే ఈ నేరాన్ని పోల్చుతున్నారు. అప్పట్లో కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు దుండగులు లైంగిక దాడి చేశారు. అనంతరం బస్సు నుంచి ఆమెను తోసివేయడంతో తీవ్ర గాయాల పాలైన బాధితురాలు వారం రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఈ కేసులోనూ దుండగులు మహిళను బస్సులో బలవంతంగా లాక్కెళ్లడంతోపాటు బస్సును నడుపుతూ పలు దఫాలుగా లైంగిక దాడి చేయడంపై మహిళాలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విపక్షాలు సైతం ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఢిల్లీ పోలీసుల పనితీరు సరిగా లేకపోవడం వల్లే బస్సు 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించినా, పోలీసులు గుర్తించలేకపోయారంటూ ఆప్ నేతలు మండిపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu