Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మనకు సంబంధం లేని యుద్ధం.. భారత్‌కు తప్పని ఆర్థిక గండం!

మనకు సంబంధం లేని యుద్ధం.. భారత్‌కు తప్పని ఆర్థిక గండం!

Tupaki.com 2 days ago

భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే విశ్లేషణలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా స్థిరమైన పటిష్టమైన వృద్ధితో దూసుకుపోయిన భారత్..

రాబోయే రోజుల్లో ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోబోతోందా? అనే చర్చే ఎక్కవగా జరుగుతోంది. ప్రధానంగా పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లను కుదిపేస్తుండటంతో ధరల సెగ ఎక్కువవుతోందని అంటున్నారు. దీనివల్ల ఆర్థిక కష్టాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముడిచమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్ లో ధరల పెరుగుదల పెద్ద భారం కాబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.

వృద్ధి రేటు అంచనాలకు బ్రేక్

ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశ వృద్ధిరేటు తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన మధ్యంతర నివేదికలో భారత్ జీడీపీ వృద్ధి రేటు తగ్గినట్లు వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతంగా అంచనా వేసిన భారత వృద్ధి రేటు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ 6.4 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. గతంలో దీనిని 6.6 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు దానికి మరింత కోత పెట్టడం దేశీయంగా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రాబోయే ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంటూ అంతర్జాతీయ పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మందగమనం ఎందుకంటే..?

పశ్చిమాసియా సంక్షోభంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతినడంతో నిత్యావసరాలు, ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషిస్తున్నారు. దీనిని అదుపు చేయడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను గరిష్ట స్థాయిల్లోనే కొనసాగిస్తున్నాయని చెబుతున్నారు. దీనివల్ల కంపెనీల రుణాల భారం పెరిగి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు వెనుకంజ వేస్తున్నాయని అంటున్నారు. అదేసమయంలో స్థానిక వినియోగం తగ్గడం కష్టాలను ఎక్కువ చేస్తోందని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మధ్యతరగతి వర్గాలలో కొనుగోలు శక్తి తగ్గడం పరిశ్రమలను వేధిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్, కన్స్యూమర్ గూడ్స్ వంటి రంగాలలో డిమాండ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం మందగమనాన్ని సూచిస్తోందని చెబుతున్నారు.

ఎగుమతులపై దెబ్బ

ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్ దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో భారత్ నుంచి జరిగే ఐటీ సేవలు, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు మందగించాయని చెబుతున్నారు. అయితే "ఇది పూర్తి స్థాయి ఆర్థిక మాంద్యం కాకపోయినప్పటికీ, వృద్ధి వేగం తగ్గడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కొందరు పరిశ్రమల సమాఖ్యల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వచ్చే యువతకు అవకాశాలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడులు నిలిచిపోవడం వంటివి జరిగితే దేశీయ ఆర్థిక చక్రం మందగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

మనం కొంత బెటర్ అంటూ..

అయితే, వృద్ధి రేటు తగ్గినప్పటికీ ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ ఇప్పటికీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతుందని వరల్డ్ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి చెబుతుండటంతో కాస్త ఊరట లభిస్తోందని అంటున్నారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు, జీఎస్టీ వసూళ్లు బలంగా ఉండటం దేశానికి ఉన్న సానుకూలాంశాలుగా వివరిస్తున్నారు. ఇదే సమయంలో ముడిచమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్ల ఒడిదుడుకులు ఇలాగే కొనసాగితే భారత్ ఆర్థిక మందగమనాన్ని చూడాల్సి వస్తుందని మాత్రం హెచ్చరిస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించడానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎలాంటి ఆర్థిక సంస్కరణలు, ద్రవ్య విధానాలు తీసుకుంటాయనే దానిపైనే భారత ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu