Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రిపై కాకరేపిన కామెంట్స్.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బుక్కయిపోయారా?

మంత్రిపై కాకరేపిన కామెంట్స్.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బుక్కయిపోయారా?

Tupaki.com 4 days ago

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నెల 14న కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైసీపీ నిర్వహించిన ధర్నాలో మంత్రి టీ.జీ.భరత్ లక్ష్యంగా సిద్దార్థ్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారని అంటున్నారు. మంత్రిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసి కాక రాజేశారని అంటున్నారు. అయితే సిద్ధార్థ్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన మంత్రి టీ.జీ.భరత్ ముందుగా పోలీసు కేసు పెట్టారని, త్వరలోనే పరువు నష్టం దావా కూడా వేయనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ నేత సిద్ధార్థ్ రెడ్డిపై పోలీసు కేసుతో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని అంటున్నారు. మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేసిన సిద్ధార్థ్ రెడ్డికి చెక్ చెప్పాలని టీడీపీ హైకమాండ్ భావించిందని, దీంతోనే అన్ని కోణాల్లో ఆలోచించి సిద్ధార్థ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యేలా పావులు కదిపిందని అంటున్నారు. మరోవైపు పరువు నష్టం దావా కూడా వేసి సిద్ధార్థ్ రెడ్డి నోటికి తాళం వేయించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక వైసీపీలో కీలక నేతగా ఎదిగిన భైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి టీ.జీ.భరత్ ను లక్ష్యంగా చేసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి ఓ ఫార్మా కంపెనీ వద్ద రూ.45 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపణలతో సంచలనం రేపారని చెబుతున్నారు. ఈ ఆరోపణలపై కఠినంగా వ్యవహరించకపోతే సిద్ధార్థ్ రెడ్డి ఇంకా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉందన్న ఆలోచనతో మంత్రి టీ.జీ.భరత్ నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. సిద్ధార్థ్ రెడ్డి ఆరోపణలను ముందుగానే ఖండించిన మంత్రి భరత్ పోలీసులకు ఫిర్యాదుచేసి తగ్గేదేలే అన్న సంకేతాలు పంపారని అంటున్నారు.

ఈ పరిణామాలతో వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చిక్కుల్లో పడినట్లేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధార్థ్ రెడ్డి విమర్శలు చేసిన వారం తర్వాత ప్రభుత్వం కేసు నమోదుకు ఆదేశించడం పరిశీలిస్తే, ఈ విషయంలో న్యాయపరమైన సలహా తీసుకుని వైసీపీ నేతను ఇబ్బంది పెట్టేలా పకడ్బందీ వ్యూహంతోనే ముందడుగు వేసి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ రెడ్డి అరెస్టుకు ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదరవుతాయి..? వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందా? వంటి విషయాలను పరిశీలిస్తున్నారని, అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu