Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మర్యాదగా లోన్ రికవరీ.. ఆర్ బీఐ కొత్త మార్గదర్శకాలు?

మర్యాదగా లోన్ రికవరీ.. ఆర్ బీఐ కొత్త మార్గదర్శకాలు?

Tupaki.com 2 days ago

ప్రైవేటు కావొచ్చు.. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ నుంచి కావొచ్చు. తీసుకున్న రుణాన్ని ఒప్పుకున్నట్లుగా తిరిగి చెల్లించకుంటే.. ఒక స్థాయి దాటిన తర్వాత సదరు బ్యాంకులకు చెందిన లోన్ రికవరీ ఏజెంట్లు ఎంత దారుణంగా వ్యవహరిస్తారో..

మరెంత అరాచకాన్ని క్రియేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుకోని ఇబ్బందుల కారణంగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకుంటే బ్యాంక్ రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులకు ఇప్పటివరకు చెక్ పెట్టే చట్టబద్దత లేదు. సమయం.. సందర్భం అన్నది లేకుండా ఫోన్లు చేసి బూతులు తిట్టటం.. ఇళ్లకు రావటం.. బలవంతపు చర్యలకు పాల్పడటం లాంటివి తెలిసినవే. మొత్తంగా ప్రత్యక్ష నరకాన్ని చూపే రికవరీ ఏజెంట్లకు చెక్ పెట్టేలా తాజాగా రిజర్వు బ్యాంక్ కొత్త మార్గదర్శకాల్ని తీసుకొచ్చింది.

కొన్ని బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు మరో అడుగు ముందుకు వేసి.. లోన్ రికవరీ బాధ్యతల్ని కొన్ని సంస్థలకు అప్పజెబుతారు. వారు చేసే వేధింపులకు తమకు బాధ్యత లేదన్నట్లుగా చెప్పి తప్పించుకుంటారు. ఎందుకంటే.. లోన్ రికవరీ ఏజెంట్లు బ్యాంకు ఉద్యోగులు కాదని చెబుతుంటారు.

ఈ తరహా వేధింపులకు చెక్ పెట్టేలా రిజర్వు బ్యాంక్ కీలక మార్గదర్శకాల్ని తీసుకురానుంది. దీనికి సంబంధించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు కీలక మార్పుల్ని ప్రస్తావించారు. కొత్తగా తేవాలని భావిస్తున్న మార్గదర్శకాలపై ప్రజల అభిప్రాయాన్ని రిజర్వు బ్యాంక్ కోరుతోంది. ఈ నెల 31 లోపు ప్రజలు తమ అభిప్రాయాలు చెబితే.. తుది నిర్ణయం ఆర్ బీఐ తీసుకొని.. అధికారికంగా విడుదల చేయనుంది. తాజా మార్గదర్శకాల ముసాయిదాలో లోన్ రివకరీ ఏజెంట్లు.. లోన్ రికవరీ సంస్థలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాన్ని ఆర్ బీఐ ఇవ్వటం గమనార్హం. అంతేకాదు.. బ్యాంకుల తరపు ఏజెంట్లు చేసే తప్పులకు బ్యాంకులు బాధ్యత వహించేలా నిబంధనల్ని రూపొందించటం గమనార్హం. లోన్ తీసుకున్న వారి రక్షణకు కొన్ని చర్యలను ప్రతిపాదించింది.

ఇంతకూ ఆర్ బీఐ తీసుకొచ్చిన మార్గదర్శకాల ముసాయిదాలోకి వెళితే..

ఇందులో కీలకమైన అంశం.. లోన్ రికవరీ కోసం ఏజెన్సీలు.. తమ ఏజెంట్లను ఎవరు పడితే వారిని నియమించటానికి వీల్లేదు. ఇప్పటికైతే కాస్త కండబలం..నోటి దూకుడు ఉన్న వారికి ప్రధమ ప్రాధాన్యత అన్నట్లుగా వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది. ఇప్పుడు ఆ తీరుకు చెక్ పడేలా ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ అలాంటిది లేకుంటే అందుకు సమానమైన అర్హత ఉన్న వారిని మాత్రమే నియమించాల్సి ఉంటుంది. బ్యాంకుల తరపున పని చేసే రికవరీ ఏజెన్సీల వివరాల్ని సదరు బ్యాంకులు తమ వెబ్ సైట్ లో పెట్టాలి. లోన్ రికవరీ ఏజెంట్ల విధి నిర్వహణకు సంబంధించి కచ్చితమైన రూల్స్ ఉంటాయి. వాటిని పక్కాగా పాటించాలి.

మొండి బకాయిల లెక్క తేల్చేందుకు లోన్ రికవరీ ఏజెంట్లు ఎవరి ఇంటికైనా వెళ్లాల్సి వస్తే.. ఒక రోజు ముందే ఆ విషయాన్ని కస్టమర్ కు బ్యాంకులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రికవరీ ఏజెంట్లుగా వెళ్లే వారు తమ వెంట గుర్తింపు కార్డుతో పాటు.. లోన్ రికవరీ పత్రాన్ని తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. తాము వచ్చే వివరాల్ని వెల్లడించిన తర్వాత.. సదరు ఏజెంట్ ఏదైనా కారణంతో వెళ్లలేని పక్షంలో ఆ విషయాన్ని సదరు వినియోగదారుకు వెంటనే సమాచారం అందించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న వారినే కాదు.. రుణానికి గ్యారెంటీగా ఉన్న వారిని సైతం తరచూ ఫోన్లు చేసి వేధించకూడదు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల లోపు మాత్రమే ఏజెంట్ల కస్టమర్లను సంప్రదించాల్సి ఉంటుంది. కస్టమర్ తో మర్యాదగా వ్యవహరించటం.. కస్టమర్ పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించకూడదు. తిట్టటం.. వేధింపులకు గురి చేయటం నిషిద్ధం.

సరైన సమయంలో లోన్ చెల్లింపులు జరపని వారికి ఫోన్లు చేసి తిట్టటం.. సదరు వ్యక్తి స్నేహితులకు.. బంధువులకు ఫోన్లు చేసి చెబుతానని బెదిరింపులకు దిగటం లాంటివి చేయకూడదు. కస్టమర్ ఫోన్ నెంబర్.. లోన్ వివరాలు.. ఇతర వ్యక్తిగత వివరాల్ని సోషల్ మీడియాలో బ్యాంకులు.. ఏజెంట్లు బయటపెట్టకూడదు. లోన్ రికవరీలో భాగంగా ఏజెంట్లు కానీ బ్యాంకులు కానీ ఫోన్ చేసే సమయంలో ఆ కాల్స్ ను తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆర్నెల్ల రికార్డును భద్రపర్చాలి. కస్టమర్ ఫోన్ డేటాను బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించకూడదు. ఏదైనా రుణంపై న్యాయ వివాదం ఏర్పడి.. అది కొనసాగుతున్న సమయంలో రికవరీ కోసం నియమించిన సంస్థను మార్చకూడదు.

ఫోన్ కొనుగోలు ఈఎంఐ పద్దతుల్లో తీసుకొని.. ఒక్క ఈఎంఐ కట్టని కారణంగా కస్టమర్ ఫోన్ ను బ్లాక్ చేయకూడదు. అరవై రోజులు గడిచిన తర్వాత మొదటి నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత మరో 21 రోజులు సమయం ఇవ్వాలి. అప్పుడు రెండో నోటీసు ఇవ్వాలి. అలా ఇచ్చిన ఏడు రోజుల తర్వాత కూడా సదరు వినియోగదారు లోన్ మొత్తాన్ని చెల్లించకుంటే అతడి ఫోన్ ను పరిమితంగా బ్లాక్ చేయొచ్చు. కస్టమర్ ఫోన్ ను పరిమితంగా బ్లాక్ చేయాలని భావిస్తే.. తీసుకున్న అప్పు సదరు ఫోన్ కొనేందుకు మాత్రమే అయి ఉండాలి. ఒకవేళ కస్టమర్ డబ్బులు చెల్లించిన తర్వాత ఆ ఫోన్ సేవల్ని పునరుద్ధరించకుంటే.. ప్రతి గంటకు రూ.250 చొప్పున వినియోగదారుకు పరిహారం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పలు అంశాల్ని ముసాయిదాలో చేర్చారు. దీనిపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి.. తుది నిర్ణయాన్ని భారత రిజర్వు బ్యాంక్ ప్రకటిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu