Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా లైఫ్ లో అన్నీ ఆలస్యంగానే వచ్చాయి!

నా లైఫ్ లో అన్నీ ఆలస్యంగానే వచ్చాయి!

Tupaki.com 3 weeks ago

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్ట్ లో మురళీ శర్మ పేరు ముందువరుసలో ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసే ఈ నటుడు నేడు దర్శకుల మొదటి ఎంపికగా మారిపోయారు.

అయితే ఆయన కెరీర్‌ను పరిశీలిస్తే ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభంగా జరగలేదని తెలుస్తుంది. ముఖ్యంగా తన జీవితంలో అవకాశాలు, సక్సెస్‌లు అన్నీ ఆలస్యంగానే వచ్చాయని మురళీ శర్మ స్వయంగా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మురళీ శర్మ తన పర్సనల్ లైఫ్ తో పాటూ, కెరీర్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, చిన్న వయసులో పెళ్లి చేసుకుంటానంటే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పేవారేమో కానీ, తన లైఫ్ లో ప్రతిదీ ఆలస్యంగా జరగడంతో అలాంటి సమస్య ఎదురుకాలేదని అన్నారు. నటుడిగా కెరీర్ ప్రారంభించినప్పుడు హీరో అవ్వాలనే కలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టానని, కానీ అవకాశాలు రావడం మొదలయ్యే సమయానికి తన వయసు, రూపం కారణంగా తండ్రి పాత్రలకు మారాల్సి వచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే తన విజయానికి కారణమని చెప్పారు. తనకంటే ప్రతిభావంతులైన ఎంతోమంది నటులు ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారన్నారు. బహుశా తాను టార్గెట్ కోసం మొండిగా పట్టుదలతో ముందుకు సాగడమే దానికి కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే టార్గెట్ ను రీచ్ అయ్యే క్రమంలో మధ్యలో కొన్నాళ్ల పాటూ తాను దాన్నుంచి డీవియేట్ అయిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. కొంతకాలం ప్రొడక్షన్ విభాగంలో పనిచేయడంతో పాటు జర్నలిస్టుగానూ సేవలందించినట్టు పేర్కొన్నారు. జర్నలిజాన్ని మాత్రం ఎంతో ఇష్టపడి చేశానని, దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఆ రంగంలో కొనసాగానని చెప్పారు. సహజంగా రచనలు చేయగలనని, ఇప్పటికీ తన భార్య సెలబ్రిటీ కాలమ్స్ రాయమని ప్రోత్సహిస్తుంటుందని వెల్లడించారు.

ఇక మురళీ శర్మ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయన భార్య అశ్విని కల్సేకర్ కూడా ప్రముఖ నటి. హిందీ టెలివిజన్, సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ముఖ్యంగా బద్రినాథ్ సినిమాలో తమన్నా మేనత్త పాత్రలో ఆమె చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటాయి. హిందీ క్రైమ్ సీరీస్‌లతో పాటు అనేక సినిమాల్లో నటించిన అశ్విని, తన కెరీర్లో ఎంతో సపోర్ట్ గా నిలిచినట్టు మురళీ శర్మ చెప్పారు.

తెనాలిలో పుట్టి, ముంబైలో పెరిగిన మురళీ శర్మ, మొదట బాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించినప్పటికీ, నిజమైన స్టార్‌డమ్ మాత్రం టాలీవుడ్ లోనే దక్కింది. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. హీరోగా కాకపోయినా, ప్రతి సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ మురళీ శర్మ నేడు పాత్రే హీరో అయ్యే స్థాయికి ఎదిగారు. ఆలస్యంగా వచ్చిన అవకాశాలను విజయాలుగా మలచుకున్న ఆయన ప్రయాణం కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu