Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నారంగ్ రాజీనామాకు అసలు కారణమేంటి? బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగింది?

నారంగ్ రాజీనామాకు అసలు కారణమేంటి? బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగింది?

Tupaki.com 4 days ago

తెలంగాణలో గత కొన్ని రోజులుగా థియేటర్ రెంటల్ వర్సెస్ పర్సంటేజీ వివాదం ఎంత హాట్ టాపిక్‌ గా మారిందో తెలిసిందే. అదే సమయంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేయడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.

వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల తప్పుకుంటున్నానని ఆయన అఫీషియల్ గా చెబుతున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం ఇటీవల జరిగిన పరిణామాలేననే సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా భారీ సినిమాల విడుదల సమయంలో డిమాండ్లు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదలకు ముందే ఆ అంశం పెద్ద వివాదంగా మారింది. థియేటర్ల యాజమాన్యాలు తమ వాటా పెంచాలని పట్టుబడగా.. నిర్మాతలు మాత్రం ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని భావించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.

ఆ వివాదాల పరిష్కారానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు జరిగాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి చర్చలు జరిపారు. ఒక దశలో పెద్ది విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందంటూ ఓ ప్రెస్ నోట్ బయటకు రావడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ప్రకటన ఫేక్ అని ప్రెసిడెంట్ దగ్గుబాటి సురేష్ బాబు స్పష్టం చేయడంతో గందరగోళం మరింత పెరిగింది. అదే సమయంలో సునీల్ నారంగ్ రెండు వర్గాల మధ్య తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎగ్జిబిటర్ల తరఫున పర్సంటేజీ అంశాన్ని పెద్ది విడుదలకు ముందు తేల్చాలని ఆయనపై ఒత్తిడి పెరిగిందని సమాచారం.

మరోవైపు నిర్మాతల వర్గం మాత్రం ఆ అంశంపై మరింత సమయం తీసుకోవాలని భావించింది. ఆ వ్యవహారంలో ఛాంబర్‌లో ఏకాభిప్రాయం లేకపోవడం, కొందరు కార్యవర్గ సభ్యులు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేయడం సునీల్ నారంగ్‌ ను అసంతృప్తికి గురిచేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖలో కూడా ఇదే అంశాలను ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. "ఛాంబర్ నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉండాలి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కొందరిని సంతోషపెట్టేలా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి వస్తోంది. మనస్సాక్షికి విరుద్ధంగా పని చేయలేను" అని ఆయన పేర్కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆరోగ్య సమస్యలు కూడా నారంగ్ నిర్ణయానికి మరో కారణంగా మారినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. ఇటీవల జరిగిన సమావేశాల్లో కొందరు ప్రముఖ నిర్మాతలతో విభేదాలు కూడా చోటుచేసుకున్నాయని ప్రచారం సాగుతోంది. థియేటర్ వ్యవస్థ, వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీ విధానం వంటి అంశాలపై నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఏషియన్ సినిమాస్ అధినేతగా ఉన్న సునీల్ నారంగ్‌ పై కూడా విమర్శలు వచ్చాయని సమాచారం. ఇప్పుడు ఆయన రాజీనామాతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఈనెల 22న జరిగే అత్యవసర సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదాన్ని కొత్త అధ్యక్షుడు ఎలా పరిష్కరిస్తారన్నదే ఇప్పుడు టాలీవుడ్‌ లో ప్రధాన చర్చగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu