Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటి మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం!

నటి మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం!

Tupaki.com 2 days ago

ధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సంచలనం సృష్టించిన 33 ఏళ్ల త్విషా శర్మ మరణం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఒక కీలకమైన తీర్పును వెలువరించింది.

ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు త్విషా శర్మ భౌతికకాయానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించడానికి హైకోర్టు అనుమతించింది. ఈసారి అత్యంత పారదర్శకంగా దిల్లీకి చెందిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏ.ఐ.ఐ.ఎం.ఎస్‌) నిపుణులైన వైద్యుల బృందంతో ఈ శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఈ పరీక్షను భోపాల్‌లోనే నిర్వహిస్తారని.. ఇందుకోసం దిల్లీ ఎయిమ్స్ వైద్యులను ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ రాజధానికి రప్పించనున్నట్లు కోర్టు స్పష్టం చేస్తూ.. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది.

ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 33 ఏళ్ల త్విషా శర్మ 12 మే 2026న భోపాల్‌లోని తన అత్తవారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటనపై త్విషా శర్మ కుటుంబ సభ్యులు అత్తవారింటి వేధింపులే కారణమని... ఆమెను చంపేశారని ఆరోపిస్తున్నారు. దీనికి భిన్నంగా అత్తవారింటి వారు మాత్రం త్విషా డ్రగ్స్ అలవాటు వల్ల మరణించిందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉండటంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టడమే కాకుండా.. అతని సమాచారం అందించిన వారికి బహుమతిని కూడా ప్రకటించారు. కాగా సమర్థ్ సింగ్ త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోతాడని అతడి తరపు న్యాయవాది పేర్కొన్నారు.

త్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలంటూ ఆమె కుటుంబ సభ్యులు తొలుత దిగువ కోర్టును ఆశ్రయించారు. అయితే జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనుదిత గుప్తా ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ చిన్నచిన్న విధానపరమైన లోపాలను బేస్ చేసుకొని రెండోసారి పోస్ట్‌మార్టంకు ఆదేశించలేమని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం త్విషా శర్మ భౌతికకాయాన్ని భోపాల్ ఎయిమ్స్ మార్చురీలో -4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచారని సుదీర్ఘకాలం భద్రపరచడానికి -80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమని అలాంటి వసతులు నగరంలో అందుబాటులో లేవని దిగువ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో న్యాయం కోసం మృతురాలి కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి సానుకూల తీర్పు లభించింది.

ఈ అనుమానాస్పద మృతి కేసు రోజురోజుకూ క్లిష్టంగా మారుతుండటంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్లు 80(2), 85, 3(5) - కట్న నిషేధ చట్టం కింద మరణం కేసును సమగ్రంగా విచారించేందుకు సీబీఐకి బదిలీ చేయడమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం దిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం నిర్వహించనున్న ఈ రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. ఒకవైపు ఉన్నత స్థాయి వైద్య బృందం శవపరీక్ష... మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సీబీఐ విచారణ ద్వారా త్విషా శర్మ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu