Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరు 'మహానాడు'కు పొదుపు దెబ్బ? చంద్రబాబు నిర్ణయంపై సస్పెన్స్!

నెల్లూరు 'మహానాడు'కు పొదుపు దెబ్బ? చంద్రబాబు నిర్ణయంపై సస్పెన్స్!

Tupaki.com 1 week ago

నెల్లూరులో టీడీపీ మహానాడుపై సస్పెన్స్ నెలకొంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు టీడీపీ అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. అయితే చమురు సంక్షోభం నేపథ్యంలో మహానాడు వంటి భారీ కార్యక్రమం నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహానాడు నిర్వహణకు టీడీపీ సర్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, నైతికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతోపాటు స్వయంగా ఇంధన పొదుపునకు పూనుకున్నారు. అదేసమయంలో ప్రధాని సూచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పొదుపు చర్యలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో భారీగా ఖర్చయ్యే మహానాడు నిర్వహణపై సీఎం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఇలాంటి లక్షలాది మందితో మహానాడు నిర్వహిస్తే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే కార్యకర్తలు, నాయకుల కోసం భారీగా రవాణా ఏర్పాట్లు చేయడంతోపాటు భోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠతో కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తుండటంతో వాయిదా వేసే అవకాశం లేదని కూడా అంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఏటా మే నెలలో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. ప్రతి ఏటా ఇదో పెద్ద పండుగలా నిర్వహించడం టీడీపీ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నెల్లూరులో మహానాడు నిర్వహించాలని పార్టీ ముందుగా నిర్ణయించింది. యువనేత నారా లోకేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్వహించే మహానాడును ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 19 కమిటీలతో శరవేగంగా పనులు చేస్తున్నారు. చరిత్రలో కనివినీ ఎరుగనట్లు మహానాడు సక్సెస్ చేస్తామని బుధవారమే మంత్రులు, పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అదే రోజు రెండు రోజుల్లో ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో మహానాడు నిర్వహణపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu