Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ లో ఏటా ఇదే తంతు.. రాజస్థాన్ కేంద్రంగా లీకేజ్ మాఫియా?

నీట్ లో ఏటా ఇదే తంతు.. రాజస్థాన్ కేంద్రంగా లీకేజ్ మాఫియా?

Tupaki.com 1 week ago

నీట్ పేపర్ లీకుపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ మాఫియా ఏటా పేపరు లీకు చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

నీట్-2026పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ దేశంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఇందులో రాజస్థాన్ కు చెందిన ఒక కుటుంబం ప్రమేయంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తే నీట్ పేపరు లీకు తంతు ప్రతి ఏటా కొనసాగుతోందని, ఇదొక వ్యవస్థీకృత నేరంగా మారిందనే సంచలన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

సీబీఐ అధికారులు, రాజస్థాన్ పోలీసుల సమాచారం ప్రకారం జైపూర్ జిల్లా రామ్ గడ్ కు చెందిన మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్ సోదరులు గత కొన్నేళ్లుగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముందుగా తమ కుటుంబ సభ్యుల కోసం ప్రశ్నపత్రాలను సేకరిస్తున్న బివాల్ సోదరులు అనంతరం విద్యార్థులకు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారని అంటున్నారు. నీట్ 2026 కేసులో నిందితులు అయిన బివాల్ సోదరులు రాజస్థాన్ లోని సికార్ లో కోచింగ్ సెంటర్ల మాఫియాతో చేతులు కలిపి పేపర్ లీకు వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురికి గత ఏడాది ఫ్రీ మెడికల్ సీట్లు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఒకే సారి, ఒకే కుటుంబానికి చెందిన విద్యార్థులకు అన్ని ఫ్రీసీట్లు రావడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఇంటర్ లో అత్తెసరు మార్కులతో పాసై, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మాత్రం మంచి మార్కులతో నీట్ కు అర్హత సాధించడంపైనే సందేహాలు వ్యక్తమవున్నాయి. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీ కోసం నిందితులు సుమారు రూ.65 లక్షలు వెచ్చించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు కథనాలు వస్తున్నాయి.

కాగా, నీట్ పేపరు లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. విద్యార్థులను మానసికంగా కుంగదీసిన ఈ వ్యవహారానికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రధానంగా రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ల మాఫియా మధ్య ఆధిపత్య పోరాటం వల్లే పేపరు లీకు ఉదంతం చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా పేపర్ లీకు వ్యవహారం వెలుగుచూడటానికి కూడా కోచింగ్ సెంటర్ల మధ్య విభేదాలే కారణమని అంటున్నారు. దర్యాప్తు అధికారులు ఈ కోణంలో కూడా విచారణ కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu