Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఔను.. సాయిరెడ్డిని కొట్టారు : టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ప్రకటన

ఔను.. సాయిరెడ్డిని కొట్టారు : టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ప్రకటన

Tupaki.com 4 days ago

వైసీపీలో మరింత అగ్గిరాజేశాలా అధికార టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనపై దాడి చేశారంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు.

రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలో తాను వైసీపీలో ఉండగా, సజ్జల రామకృష్ణారెడ్డి తనపై దాడి చేశారంటూ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ విషయమే హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి జోక్యం చేసుకోవడం మరింత ఆసక్తి రేపుతోంది.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయడం నిజమేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై స్పందించారు. ఈ విషయంలో తాను మాట్లాడాల్సిన అవసరం లేదంటూనే అప్పట్లో ఏం జరిగిందో పూస గుచ్చినట్లు వివరించారు. ప్లీనరీ వేదికపై ఎవరిని మాట్లాడించాలనే విషయమై విజయసాయిరెడ్డి, సజ్జల చర్చించుకునే సమయంలో మాటామాటా పెరిగి దాడి చేసే వరకు వెళ్లిందని తెలిపారు. ప్లీనరీ వేదికకు ఆనుకుని వేసే రెస్ట్ రూములలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ తెలుసునని కోటంరెడ్డి వివరించారు.

అగ్గిరాజేయడానికేనా..?

అయితే, కోటంరెడ్డి వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య మరింత అగ్గిరాజేశాలా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తనపై దాడి జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించగా, నాలుగేళ్ల తర్వాత ఆయన ఇలా మాట్లాడటంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న సజ్జల సైతం ఈ విషయాన్ని లైటుగా తీసుకున్నట్లు వ్యవహరించారు. దాడి చేశానని అంటే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా? అని విజయసాయిరెడ్డి ఆరోపణలపై సజ్జల స్పందించారు. కానీ, గొడవ జరగడమే కాదు విజయసాయిరెడ్డిని చొక్కా పట్టుకుని కొట్టారని, అలా ఎందుకు కొట్టారో తెలుసు అంటూ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్ష వైసీపీలో ఎవరికీ గౌరవం ఉండదని ప్రచారం చేయడంలో భాగంగానే అధికార పార్టీ కోటంరెడ్డితో ఇలా మాట్లాడించిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు విజయసాయిరెడ్డి, సజ్జల మధ్య గొడవ జరిగిందో? లేదో? కానీ ఈ విషయమై ఇటీవల చోటుచేసుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణలను రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ భావించడమే హాట్ టాపిక్ అవుతోందని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ వ్యవహారాలపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు దుమారం రేపుతుండగా, ఈ విషయంలో వైసీపీ సీనియర్ నేత సజ్జలను మరింత ఇరకాటంలో పెట్టేలా టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఈ విషయమై కోటంరెడ్డిని రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కోటంరెడ్డితోపాటు నెల్లూరుకు చెందిన ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరంతా ఇప్పుడు టీడీపీ తరఫున యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇక అందరి కంటే ఎక్కువ మాటకారి కావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డికి విజయసాయిరెడ్డి, సజ్జల ఎపిసోడ్ పై టాస్క్ అప్పగించారని పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా వైసీపీలో అంతర్గతంగా రేగిన దుమారాన్ని టీడీపీ మలుపు తిప్పే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu