Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఔను వస్తున్నా.. విజయసాయి చెప్పేది ఇదేనా..?

ఔను వస్తున్నా.. విజయసాయి చెప్పేది ఇదేనా..?

Tupaki.com 1 week ago

వైసీపీలోకి పునరాగమనం అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జరుగుతున్న ప్రచారంపై ఆయన తొలిసారిగా స్పందించారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న ఈ అంశంపై 'ఎక్స్' వేదికగా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తనది స్వతంత్ర భావజలమని, ఎవరి ఒత్తిళ్లు, ప్రలోభాలు, ప్రభావాలకు లోనుకాకుండా నిర్భయంగా ఆత్మగౌరవంతో త్వరలో ప్రకటన చేస్తానంటూ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ఈ ట్వీట్ లో ఎక్కడ అభ్యంతరం చెప్పకపోవడం, ఆ సమాచారం తప్పు అని ఖండించకపోవడంతో మాజీ ఎంపీ వ్యవహారం రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతోందని అంటున్నారు.

దాదాపు ఏడాదిన్నర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్న వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ విస్తృత చర్చకు దారితీసింది. ''నా రాజకీయ పునః ప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం. ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకు, ప్రభావాలకూ లోనుకాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను.'' అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ తో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి కోసం తాను ఎంతగానో శ్రమిస్తే, ఆయన తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో 2025 జనవరి 31న తన రాజ్యసభ సభ్యత్వంతోపాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఏకంగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆయన బీజేపీలో చేరతారని అప్పట్లో ప్రచారం జరిగినా అది కుదరలేదని అంటున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో అధినేత చుట్టూ కోటరీ ఉందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొందరు నేతల పేర్లు చెప్పి మరీ తన ఆక్రోశం వెళ్లగక్కారు.

ఇక విజయసాయిరెడ్డి రాజీనామా చేసి దాదాపు ఏడాదిన్నర కావస్తుండగా, తాజాగా ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవ్వనున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. సొంతంగా పార్టీ పెడతారని కొందరు, కాదు వైసీపీలోనే తిరిగి చేరనున్నారని మరికొందరు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి చెందిన ఢిల్లీ వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రస్తుతం ఉన్న నేతలు సరిగా పనిచేయలేకపోతున్నారని, అందుకే విజయసాయిరెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ హాట్ డిబేట్ కు దారి తీసింది. ఇందులో తన పునరాగమనంపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా, త్వరలో ఈ సస్పెన్స్ కు తెర దించుతానని చెప్పడమే ఉత్కంఠ రేపుతోంది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ తో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అనే అంశంపై పరిశీలకులు ఆరా తీస్తున్నారు. ఏదిఏమైనా ఒకటి రెండు రోజుల్లో ఏ విషయం చెబుతానని విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ తో ఆయన రీ ఎంట్రీపై ఊహగానాలు మరింత ఎక్కువయ్యాయని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu