Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదవీ గండం వేళ..  హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్

పదవీ గండం వేళ.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్

Tupaki.com 5 days ago

హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న 'హైడ్రా' కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంలో ఆయనను పదవి నుంచి తప్పించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చి తీవ్ర ఆదేశాలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాత్కాలిక స్టే విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రంగనాథ్‌ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై మంగళవారం విచారణ జరిగింది. రంగనాథ్‌ తరఫున హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజీవ్‌ శక్దర్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అసలు వివాదం ఏంటి?

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలంలోని లోతుకుంట గ్రామం సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు వివాదానికి దారితీశాయి. ఈ నెల 17న హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలను సవాల్‌ చేస్తూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధ పాలనకు ముప్పుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారి కీలక పదవిలో కొనసాగడం సరికాదని పేర్కొంటూ హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి ఎ.వి. రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ఏడాదిన్నరలో 63 ధిక్కరణ పిటిషన్లపై కోర్టు ఆందోళన

రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్ల సంఖ్యపైనా సింగిల్‌ జడ్జి తీవ్రంగా స్పందించారు. గత ఐదేళ్లలో తెలంగాణ హైకోర్టులో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా.. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఒక్క రంగనాథ్‌కు సంబంధించిన 63 ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హైడ్రా కమిషనర్‌ ఐజీ ర్యాంకు అధికారి, కార్యదర్శి స్థాయి హోదాలో ఉంటారని.. ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ఆయన ప్రధాన బాధ్యత అని కోర్టు పేర్కొంది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 99లో ఈ అంశం స్పష్టంగా ఉందని గుర్తుచేసింది.

ఇప్పుడు డివిజన్‌ బెంచ్‌లో కీలక విచారణ

సింగిల్‌ జడ్జి తీర్పుపై రంగనాథ్‌ దాఖలు చేసిన అప్పీల్‌లో తాజాగా లభించిన తాత్కాలిక ఊరటతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ఆయనను హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి తప్పించాలన్న సింగిల్‌ జడ్జి ఆదేశాల అమలు నిలిచిపోయింది.

అయితే ఇది తుది తీర్పు కాదు. డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌పై తదుపరి విచారణలో ఇరు పక్షాల వాదనలు, కోర్టు ధిక్కరణ ఆరోపణలు, హైడ్రా చేపట్టిన చర్యల చట్టబద్ధత వంటి అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో రంగనాథ్‌ వ్యవహారం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu