Dailyhunt
పూరికి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఏంటంటే?

పూరికి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఏంటంటే?

Tupaki.com 2 weeks ago

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పూరీ జగన్నాథ్ ఓ సంచలనం. ఆయన రాసే పదునైన సంభాషణలు, డిజైన్ చేసే హీరో క్యారెక్టరైజేషన్లు యువతలో ఓ ఊపు తెస్తాయి. అయితే గత కొంతకాలంగా పూరీ దర్శకత్వం వహించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాల సాధించడం లేదు.

ఈ నేపథ్యంలో పూరీ ఫ్యాన్స్ నుంచి ఓ వింతైన, ఆసక్తికరమైన రిక్వెస్ట్ వినిపిస్తోంది. `పూరీ గారూ.. మీరు సినిమాలు తీయడం ఆపేసినా మాకు బాధ లేదు. కానీ మీ పూరీ మ్యూజింగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి అని సోషల్ మీడియా వేదికగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.పూరీ జగన్నాథ్ లాక్ డౌన్ సమయంలో ప్రారంభించిన మ్యూజింగ్స్ పాడ్‌కాస్ట్ సిరీస్ అనూహ్యమైన ఆదరణ పొందింది.

సినిమా ముచ్చట్లు మాత్రమే కాకుండా.. ప్రపంచం, మనుషుల స్వభావం, డబ్బు, విజయం, ఓటమి, లైఫ్ స్టైల్ వంటి అనేక అంశాలపై పూరీ తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. ఇందులో ఆయన చెప్పే పచ్చి నిజాలు, ప్రాక్టికల్ ఫిలాసఫీ నేటి యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక సినిమా మూడు గంటల పాటు ఇచ్చే వినోదం కంటే మూడు నిమిషాల పూరి మ్యూజింగ్ ఇచ్చే కిక్ , క్లారిటీ బాగుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమకాలీన సమాజంలో జరుగుతోన్న పరిణామాలను పూరీ ఎంతో నిజాయితీగా, ఏమాత్రం మొహమాటం లేకుండా చర్చిస్తారు. ఇటీవల ఆయన చేసిన అహంకారం,`రిజెక్షన్`వంటి ఆడియో క్లిప్పింగ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.

విజయం వచ్చినప్పుడు మనుషులు ఎలా మారిపోతారు. ఓటమిని ఎలా స్వీకరించాలి ?అనే విషయాలను ఆయన తన సొంత అనుభవాలను రంగరించి చెప్పడం తో అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే ఆయన సినిమాల కంటే ఈ ఫిలాసఫీ సెషన్లకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సినిమా రంగంలో ఒక దర్శకుడిగా పూరీ జగన్నాథ్ ఫామ్ కోల్పోయారనే విమర్శలు వినిపిస్తున్నా? ఒక ఆలోచనాపరుడిగా ఆయన గ్రాఫ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆయన సినిమాల్లోని అతివాదం, రొటీన్ మాస్ ఎలిమెంట్స్ పట్ల అసంతృప్తిగా ఉన్న వారు కూడా ఆయన పాడ్‌కాస్ట్‌లను మాత్రం ఎంతో ఆసక్తిగా వింటారు. పూరి గొంతులో ఉండే గాంభీర్యం, విషయాల పట్ల ఆయనకు ఉండే స్పష్టత గురువులా మార్గనిర్దేశం చేస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

పూరీ సినిమాలు కమర్షియల్ లెక్కల కోసం తీసేవిగా మారిపోయాయి. కానీ ఆయన మ్యూజింగ్స్ మాత్రం హృదయాంతరాల నుండి వచ్చే వాస్తవాలు. ఒక దర్శకుడిగా ఆయన పతనం గురించి చర్చ జరుగుతున్న ప్రతిసారీ, ఆయన ఒక కొత్త మ్యూజింగ్‌తో వచ్చి అందరినీ ఆలోచింపజేస్తున్నారు. `మాకు ఇస్మార్ట్ శంకర్ వద్దు.. కానీ ఆ స్మార్ట్ థాట్స్ కావాలి` అనేది నేటి సగటు పూరీ అభిమాని కోరిక. జగన్నాథ్ తన తదుపరి సినిమాలతో మళ్ళీ ఫామ్‌లోకి వస్తారా లేదా అనేది పక్కన పెడితే మ్యూజింగ్స్ ద్వారా ఆయన సమాజంలో ఓ కొత్త చర్చకు తెరలేపారు. సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ ఫ్లాప్ అవ్వవని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ డిజిటల్ యుగంలో పూరీ మ్యూజింగ్స్ ఒక సరికొత్త మార్గదర్శకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu