Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పురుషులకు ఎక్కువ.. మహిళలకు తక్కువ.. ఇదేం వ్యత్యాసం?

పురుషులకు ఎక్కువ.. మహిళలకు తక్కువ.. ఇదేం వ్యత్యాసం?

Tupaki.com 1 week ago

న దగ్గర నినాదాలకేం కొదవ లేదు.. "నారీ గ్రేట్", "మహిళలు ఆకాశంలో సగం" అంటూ వేదికలు ఎక్కి మైకులు పగిలేలా ఉపన్యాసాలు దంచేస్తుంటాం.

కానీ అసలు విషయానికి వచ్చేసరికి ఆ ఆకాశంలో సగం మాట దేవుడెరుగు.. నెల చివర వచ్చే జీతంలో మాత్రం పాతిక శాతానికి పైగా కోత పక్కాగా అమలు జరుగుతోంది. ఈ విచిత్రాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా లెక్కలతో సహా వెల్లడించి.. మన దేశంలో సమానత్వం ఎంత అద్భుతంగా అమలువుతోందో కళ్ళకు కట్టినట్లు చూపించింది.

కేంద్రం సమాచారం ప్రకారం.. రెగ్యులర్ ఉద్యోగం చేసే ఒక పురుషుడు నెలకు సగటున ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేడు రూపాయలు జేబులో వేసుకుంటే.. అదే స్థాయి ఉద్యోగం చేస్తూ సమానంగా కష్టపడే మహిళ మాత్రం కేవలం పద్దెనిమిది వేల మూడు వందల యాభై మూడు రూపాయల దగ్గరే ఆగిపోవాలి.. అంటే జెండర్ పే గ్యాప్ ఏకంగా 24.2 శాతంగా ఉంది. అసలు ఈ ఐదున్నర వేల రూపాయల తేడా వెనుక ఉన్న రహస్యం ఏంటో ఎవరికీ అర్థం కాదు.. ఆఫీసులో మగాళ్ల కంటే మహిళలు తక్కువ గంటలు పనిచేస్తున్నారా అంటే అదీ లేదు.. లేదంటే డెడ్‌లైన్ల విషయంలో ఏమైనా రాయితీ ఇస్తున్నారా అంటే అదీ లేదు. అయినా సరే జీతం పడే సమయానికి వచ్చేసరికి "మీరు మహిళలు కదా మీకు ఈ మాత్రం చాలులే" అన్నట్టుగా యజమానులు ఇచ్చే ఈ 'జెండర్ డిస్కౌంట్' నిజంగా అభినందనీయం!

ఇక ఆఫీసుల్లో తెల్ల కాలర్ ఉద్యోగాలు చేసేవారి పరిస్థితే ఇలా ఉంటే.. రోజంతా ఎండలో నడుములు విరిగేలా కష్టపడే దినసరి కూలీల పరిస్థితి చూస్తే ఈ అసమానతల ప్రేమ మరీ పరాకాష్టకు చేరింది. అక్కడ మగ కూలీకి రోజుకు నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చేతిలో పెడితే ఆడ కూలీకి మాత్రం కేవలం మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ వ్యత్యాసం ఏకంగా 33.7 శాతం. రోజంతా ఎండలో సిమెంట్ బస్తాలు, ఇటుకలు మోసేటప్పుడు మగవారిపై పడే ఎండ వేడి వేరు, మహిళలపై పడే ఎండ వేడి వేరా? లేక ఆడవాళ్ళు మోసే ఇటుకలు బరువు తక్కువగా ఉంటాయని ఏమైనా కొత్త భౌతికశాస్త్ర సూత్రం కనుక్కొన్నారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే మన వ్యవస్థ చిన్నగా నవ్వి ఊరుకుంటుంది.

మన కార్పొరేట్ కంపెనీలు, యజమానులు బహుశా "ఉమెన్స్ డే" నాడు ఆఫీసుల్లో ఉచితంగా పంచే గులాబీ పూలు, చాక్లెట్లు, కేకుల బడ్జెట్‌ను ఇలా మహిళల జీతాల్లో కోత విధించి మరీ భర్తీ చేసుకుంటున్నారేమో అని అనుమానం రాక మానదు. మహిళలకు కంపెనీల్లో అన్ని రకాల బాధ్యతలు అప్పజెప్పవచ్చు, రాత్రింబవళ్లు పనిచేయించుకోవచ్చు... కానీ రూపాయి చెల్లించే సమయానికి మాత్రం "ఆడవాళ్లకింత డబ్బెందుకు?" అనే ఆనాటి రాతియుగం ఆలోచనా విధానమే నేటి ఆధునిక లీడర్‌షిప్‌ను నడిపిస్తోంది.

మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం గురించి, వారి సాధికారత గురించి పుస్తకాలు రాసే సమాజం ఈ కోతను ఏ రకమైన "సామాజిక పన్ను" అని పిలుస్తుందో వాళ్లకే తెలియాలి. మనం ఏటా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకుపోతున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ పనికి తగ్గ ప్రతిఫలం ఇచ్చే విషయంలో మాత్రం మనం ఇంకా ఆ పాతకాలపు ఎడ్లబండి యుగంలోనే జీవిస్తున్నామని ఈ వేతన వ్యత్యాసం స్పష్టంగా నిరూపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu