Friday, 22 Jan, 6.00 am Tupaki.com

పొలిటికల్ న్యూస్
రేషన్ డీలర్లను జగన్ ఎలా డీల్ చేయబోతున్నారు?

సాధారణంగా ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని కొత్త పథకాలు ప్రారంభించడం....వాటికి అణుగుణంగా ప్రభుత్వ అధికారులు పనిచేయడం సహజం. ఈ మార్పులు చేర్పుల ప్రక్రియలో కొంతకాలం కొన్ని ఇబ్బందులు కూడా రావొచ్చు. కొత్త పథకాల వల్ల కొంతమంది కొత్తవారికి ఉపాధి ఉద్యోగం దొరికే అవకాశముంది. మరికొన్నిసార్లు పాత విధానంలో కొనసాగుతున్నవారి ఉపాధి పూర్తిగానో పాక్షికంగానో దెబ్బతినే అవకాశాలూ లేకపోలేదు. కొత్త పథకాల వల్ల కొత్త వారికి ఉపాధి దొరక్కపోయినా పర్లేదుకానీ...ఆల్రెడీ ఉన్నవారి ఉపాధి దెబ్బతినే పరిస్థితి వస్తే మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశముందే. అలాకాకుండా....పాతవారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. తాజాగా ఏపీలో అగమ్య గోచరంగా మారిన రేషన్ డీలర్లకు ఆల్రెడీ జగన్ సర్కార్ భరోసా ఇచ్చినా...వారిలో ఉన్న కొన్ని అనుమానాలు ఇపుడు చర్చనీయంశమయ్యాయి.

ఏపీలో వలంటీర్ల వ్యవస్థతో పెనుమార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల దగ్గరికే పెన్షన్లు...రేషన్ కార్డుల దరఖాస్తులు....ఇలా దాదాపుగా అన్ని పథకాలకు వలంటీర్ల వ్యవస్థ పనిచేస్తోంది. ఈ కోవలోనే ఇళ్ల దగ్గరికే రేషన్ పంపిణీ పథకాన్ని నేడు సీఎం జగన్ ప్రారంభించారు. కరోనాతోపాటు రకరకాల కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ పథకం నేడు ప్రారంభమైంది. దీంతో రేషన్ డీలర్ల పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. గతంలో జీతం కావాలని పట్టుబట్టిన డీలర్లు ....వలంటీర్ల వ్యవస్థ రావడంతో కమీషన్ ఇస్తే చాలన్న స్టేజికి వచ్చేశారు. వలంటీర్లున్నప్పటికీ... రేషన్ సరుకుల వాహనాలు వచ్చినప్పటికీ...డీలర్లను స్టాకిస్టులుగా కొనసాగిస్తామని జగన్ సర్కార్ చెబుతోంది. అయితే కొంతకాలం తర్వాత డైరెక్టుగా వలంటీర్లనే స్టాకిస్టులుగా చేస్తే తమ పరిస్థితి ఏమిటన్న అనుమానాలు రేషన్ డీలర్లకు వస్తున్నాయి. కరోనా విపత్తు సమయంలో కష్టపడి సేవలందించిన రేషన్ డీలర్ల సేవ ఎనలేనిది. కానీ తాజాగా రేషన్ సరకుల వాహనాలు ప్రారంభించిన నేపథ్యంలో రేషన్ డీలర్ల పాత్ర చాలావరకు తగ్గిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తమ భవిష్యత్తుపై డీలర్ల అనుమానాలకు అనేకా కారణాలున్నాయి. రేషన్ డీలర్ల ఇంటి నుంచి సరుకులు తీసుకుంది మొదలు.... లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసి తిరిగి వాహనాన్ని డీలర్ కు అప్పగించడం వరకు వాహనదారుడిదే పూర్తి బాధ్యత. దీంతో డీలర్ కేవలం సరుకుకి కాపలాదారుడిగా మిగిలిపోతాడు. కొంతకాలం పోయిన తర్వాత సరుకును ప్రభుత్వం నేరుగా సమీపంలోని ఎఫ్ సీఐ గూడౌన్ నుంచి వాహనాదురులకిస్తే డీలర్ల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అదీగాక వాహనాల ద్వారా సరుకుల పంపిణీకి ప్రభుత్వంపై రూ.830 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. దీంతో డీలర్ల కమీషన్లలో కోత పడుతుంద్న వాదన వినిపిస్తోంది. కమీషన్లలో కోతపడితే మాత్ర దాదాపుగా డీలర్లకు పొమ్మనకుండా పొగబెట్టినట్టేనంటున్నారు. ఇంటివద్దకు సరుకుల పంపిణీ వల్ల లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం దక్కుతుంది. అయితే అదేసమయంలో ప్రభుత్వం డీలర్ల ప్రయోజనాలకు భరోసా ఇస్తూ వారి అనుమానాల్ని నివృత్తి చేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu
Top