Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంచలనాల 'లగాన్' కాంబినేషన్ `అమీర్- అశుతోష్` జోడీతో సర్‌ప్రైజ్ స్టార్?

సంచలనాల 'లగాన్' కాంబినేషన్ `అమీర్- అశుతోష్` జోడీతో సర్‌ప్రైజ్ స్టార్?

Tupaki.com 4 days ago

ప్రపంచవ్యాప్తంగా క్రీడా నేపథ్య (స్పోర్ట్స్ డ్రామా) సినిమాలకు ఉండే క్రేజ్, మార్కెట్ వాల్యూ అంతా ఇంతా కాదు. భారతీయ చలనచిత్ర రంగంలో లగాన్, దంగల్, సుల్తాన్, చక్ దే ఇండియా, భాగ్ మిల్కా భాగ్, ఎం.ఎస్.ధోని వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ల్యాండ్‌మార్క్ విజయాలను సాధించాయి.

ముఖ్యంగా నిజజీవిత కథల ఆధారంగా.. స్ఫూర్తిదాయకమైన కథనాలతో రూపొందిన లగాన్, దంగల్ చిత్రాలు బాలీవుడ్‌లో స్పోర్ట్స్ సినిమాల వెల్లువకు బలమైన దారి చూపించాయి. అమీర్ ఖాన్ నటించిన `దంగల్` ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించి.. ఇండియన్ సినిమా పాన్-ఇండియా రేంజ్ అంటే ఏంటో అంతర్జాతీయ వేదికలపై నిరూపించింది. ఇప్పటికీ ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేని రీతిలో అలాగే నిలిచి ఉందంటే ఆ సంచలనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు దేశభక్తిని, క్రికెట్ ఆటపై అపారమైన ఆసక్తిని పెంచిన `లగాన్` చిత్రం సాధించిన ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ క్లాసిక్ సినిమా కోసం అమీర్ ఖాన్, ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ శ్రమించిన తీరు.. చెమటోడ్చిన విధానం గురించి పరిశ్రమలో ఇప్పటికీ కథలు కథలుగా చర్చించుకుంటారు. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ .. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరోసారి చేతులు కలపబోతుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం కూడా క్రీడా నేపథ్యంతో కూడుకున్న బయోపిక్ కావడం వల్ల, అమీర్ ఖాన్ నుంచి `దంగల్` రేంజ్ సంచలనాన్ని ఆశిస్తూ యువతరం.. సినిమా అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అసలు వివరాల్లోకి వెళ్తే.. భారత క్రికెట్ పితామహుడు, దేశ తొలి క్రికెట్ కెప్టెన్ అయిన లెజెండరీ లాలా అమర్‌నాథ్ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1952లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయానికి సారథ్యం వహించిన లాలా అమర్‌నాథ్ పాత్రలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కనిపించబోతున్నారు. దేశ విభజన కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ.. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ దిశానిర్ధేశనంలో రూపొందించనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ అందించిన కథతో, అభిజాత్ జోషి స్క్రీన్‌ప్లే భాగస్వామ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

అయితే ఈ సినిమాలో తాజాగా ఒక సర్‌ప్రైజ్ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. లాలా అమర్‌నాథ్ అత్యంత ఆప్తమిత్రుడి పాత్ర కోసం ప్రముఖ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. దేశ విభజనకు ముందు అఖండ భారతంలో కలిసి ఉండి.. విభజన తర్వాత పాకిస్తాన్‌కు వలస వెళ్లే ఒక కీలకమైన స్నేహితుడి పాత్రలో ఫర్హాన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు స్నేహితుల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్, మానసిక సంఘర్షణలే ఈ సినిమా కథకు ప్రధాన హృదయస్పందనగా నిలుస్తాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబర్ 2026 లో ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ నుంచే నాన్-స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ స్పోర్ట్స్ బయోపిక్‌తో పాటు అమీర్ ఖాన్ చేతిలో రాహుల్ మోడీ దర్శకత్వంలో ఒక స్టార్టప్ డ్రామా... అలాగే రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో `4-ఇడియట్స్` వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. `లగాన్` వంటి ఆస్కార్ నామినేటెడ్ చిత్రాన్ని అందించిన అమీర్-అశుతోష్ జోడీ.. ఫర్హాన్ అక్తర్ తోడుగా చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నం `దంగల్` రికార్డులను తిరగరాస్తుందేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu