Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంకెళ్లే రక్షణ వలయాలా? కండిషనింగ్‌పై స్టార్ డైరెక్టర్ క్లాస్!

సంకెళ్లే రక్షణ వలయాలా? కండిషనింగ్‌పై స్టార్ డైరెక్టర్ క్లాస్!

Tupaki.com 6 hrs ago

మాజంలో శతాబ్దాలుగా వస్తోన్న ఆచారాలు, సాంప్రదాయాలు వ్యక్తుల ఆలోచనా విధానాన్ని ఏ విధంగా శాసిస్తాయనే అంశంపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంది. కళ, సినిమా రూపంలో సమాజంలోని ఇలాంటి సంక్లిష్ట కోణాలను ఆవిష్కరించే దర్శకుడు ఇంతియాజ్ అలీ ఇటీవల పితృస్వామ్య వ్యవస్థ -మహిళల స్వేచ్ఛపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో లోతుగా పాతుకుపోయిన కొన్ని అదృశ్య ఆంక్షలు మానవ మనస్తత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే? విషయాలపై పంచుకున్న అభిప్రాయాలు సామాజిక మార్పులపై ఆసక్తి ఉన్న వర్గాలలో పెద్ద చర్చకు దారితీశాయి.

ఇంతియాజ్ అలీ తన విశ్లేషణలో ఓ ముఖ్యమైన వైరుధ్యాన్ని ఎత్తి చూపారు. సాంప్రదాయక పద్ధతులు.. బురఖా, పర్దా వంటి నిర్బంధ ఆచారాలలో తాము ఎంతో సౌకర్యవంతంగా ఉన్నామని కొందరు మహిళలు చెప్పే మాటల వెనుక ఉన్న అసలు సత్యాన్ని మనం గ్రహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. బాహ్య ప్రపంచం విధించే ఆంక్షలను వ్యక్తులు తమ సొంత ఎంపికలుగా భావించడం వెనుక తరతరాలుగా వస్తున్న సామాజిక కండిషనింగ్ దాగి ఉంటుందన్నారు. ఇది ఒక రకమైన అపస్మారక ఆమోదానికి సంకేతమని పేర్కొన్నారు.

మానసిక కోణంలో పరిశీలిస్తే ఒక నిర్దిష్ట వాతావరణంలో పెరిగే వ్యక్తులు అక్కడి పరిమితులనే తమ రక్షణ వలయంగా భావించడం సహజం. చిన్నతనం నుంచే సమాజం ..కుటుంబం నిర్దేశించిన నిబంధనలను పాటించడం వల్ల ఆ పరిధులే అలవాటుగా మారి కాలక్రమేణా అవే సౌకర్యాన్ని ఇస్తున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఒక వ్యవస్థ ఒక వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను నిరంతరం నియంత్రిస్తున్నప్పుడు ఆ నియంత్రణలోనే శాంతిని వెతుక్కోవడం అనేది నిజమైన స్వేచ్ఛ కాదని అది వ్యవస్థ సృష్టించిన మానసిక సరిహద్దు అని ఈ సందర్భంగా చర్చకొచ్చింది.

పితృస్వామ్య ఆలోచనా విధానానికి ఉన్న అతిపెద్ద ప్రమాదం దాని పునరాగమనం. సమాజం ఆధునికత వైపు అడుగులు వేస్తూ సమానత్వం వైపు పయనిస్తుందని భావిస్తున్న తరుణంలోనే పాత తరం నాటి నియంతృత్వ .. నియంత్రణ భావాలు సరికొత్త రూపాల్లో మళ్లీ సమాజంలోకి ప్రవేశిస్తాయి. సాంప్రదాయాల రక్షణ .. సంస్కృతి పేరిట వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఇలాంటి భావజాలాలు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ సమాజంలో ఏ రకమైన ప్రగతిశీల మార్పులు వచ్చినా వాటిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంటాయని అలీ భావిస్తున్నారు.

మానవ సంబంధాలను, వ్యక్తుల అంతర్గత స్వేచ్ఛను తన సినిమాల్లో లోతుగా ఆవిష్కరించే ఇంతియాజ్ అలీ వంటి సృజనాత్మక దర్శకులు ఇలాంటి సామాజిక రుగ్మతలను ప్రశ్నించడం ఎంతో అవసరం. కళ అనేది కేవలం వినోదం కోసమే కాకుండా సమాజం నిర్మించుకున్న ఇలాంటి కంఫర్ట్ జోన్స్ వెనుక ఉన్న అసంతృప్తిని, బానిసత్వాన్ని బద్దలు కొట్టేలా ఉండాలి. ఎలాంటి సామాజిక ఒత్తిళ్లు లేని స్థితిలో వ్యక్తి తీసుకునే నిర్ణయానికి, సమాజం విధించిన చట్రంలో ఉంటూ తీసుకునే నిర్ణయానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడమే నిజమైన చైతన్యం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu