Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం విజయ్ నిర్ణయంపై కోలీవుడ్‌లో పొలిటికల్ రగడ

సీఎం విజయ్ నిర్ణయంపై కోలీవుడ్‌లో పొలిటికల్ రగడ

Tupaki.com 6 days ago

మిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే పరిపాలనపై తన మార్క్ చూపిస్తున్నారు.

తన పార్టీ అయిన `తమిళగ వెట్రి కజగం` (టీవీకే) సభ్యులకు మంత్రిత్వ శాఖలను కేటాయించే క్రమంలో అత్యంత కీలకమైన `ఫిల్మ్ టెక్నాలజీ - సినిమాటోగ్రాఫ్ చట్టం` శాఖతో పాటు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచార శాఖలను పార్టీ ప్రచార కార్యదర్శి, నటుడు కం ఫిలింమేకర్ అయిన రాజ్‌మోహన్‌కు అప్పగించారు. అయితే కోలీవుడ్‌కు సంబంధించిన ఈ కీలక నియామకం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు, భిన్నాభిప్రాయాలకు దారితీసింది.

ఈ నియామకంపై ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ తన `ఎక్స్` ఖాతా ద్వారా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా సీఎం విజయ్‌ను ట్యాగ్ చేస్తూ.. కొత్త ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సంతోషకరమే అయినా.. సినిమాటోగ్రాఫ్ చట్టం మంత్రిగా రాజ్‌మోహన్‌ను నియమించడం నిరుత్సాహపరిచిందని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ.. క్షేత్రస్థాయి నుంచి ఇక్కడి కష్టనష్టాలు తెలిసిన స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ కంటే.. సినీ రంగంపై చాలా తక్కువ లేదా అసలు అనుభవం లేని వ్యక్తికి చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని, ప్రొడక్షన్ హౌస్‌ల ఇబ్బందులను ఎలా వివరించగలమని విశాల్ ప్రశ్నించారు. అయితే ఇది కేవలం పరిశ్రమ సంక్షేమం కోరి చెప్పిన తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.. రాజ్‌మోహన్‌ను కించపరచడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.

విశాల్ లేవనెత్తిన అభ్యంతరాలపై తమిళ చిత్ర పరిశ్రమ నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సీఎం విజయ్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తూ విశాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మన గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ కచ్చితంగా అన్ని కోణాల్లో ఆలోచించి.. పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని.. ఆవేశంతో స్పందించకుండా కొత్త మంత్రికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆందోళనలను తాను అర్థం చేసుకోగలనని.. అయితే కొత్త పాత్రలో స్థిరపడటానికి.. తన ప్రతిభను నిరూపించుకోవడానికి మంత్రి రాజ్‌మోహన్‌కు సరైన అవకాశం ఇవ్వడం న్యాయమని లారెన్స్ పేర్కొన్నారు. మరోవైపు ప్రముఖ నిర్మాత టి. శివ సైతం విజయ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. రాజ్‌మోహన్ గతంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించారని.. సోషల్ మీడియాలో విశేష జనాదరణతో పాటు సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నందున ఆయన ఎంపిక అత్యంత సరైనదని కొనియాడారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్‌మోహన్ నేపథ్యం పరిశీలిస్తే.. ఆయన కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. 2009లో తమిళ్ పేచు ఎంగళ్ మూచు` రియాలిటీ షో గెలిచిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఆయన నటుడిగా, స్టాండ్-అప్ కమెడియన్‌గా, `కామిక్‌స్టాన్` షో జడ్జిగా వ్యవహరించారు. 2023లో `బాబా బ్లాక్ షీప్` చిత్రంతో దర్శకుడిగా మారారు. అయితే ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చింది మాత్రం ఆయన పాపులర్ యూట్యూబ్ ఛానెల్ `పుట్ చట్నీ`. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినిపై ఆయన చేసిన `హూ కిల్డ్ అనిత` అనే ఇన్వెస్టిగేటివ్ వీడియో .. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడం ద్వారా ఆయన సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం తీవ్రంగా రక్తస్రావం` అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన విశాల్ ఈ సందర్భంగా సినిమా రంగాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి విజయ్ ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. మొదటిగా థియేటర్ టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం, ప్రేక్షకులకు ఉపశమనం కలిగించేలా `ప్రభుత్వ టికెటింగ్ విండో` విధానాన్ని తీసుకురావాలని కోరారు. రెండోది.. దేశమంతటా `ఒకే దేశం ఒకే పన్ను` అమల్లో ఉన్నా, తమిళనాడులో అదనంగా విధిస్తున్న స్థానిక సంస్థల పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చివరగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న చిత్రాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ప్రతి సంవత్సరం పెంచాలని అభ్యర్థించారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే తాము అనుభవజ్ఞులైన నాయకత్వాన్ని ఆశిస్తున్నామని విశాల్ పేర్కొనగా, ఈ సరికొత్త రాజకీయ ప్రయాణంలో సినిమా పరిశ్రమకు కొత్త మంత్రి ఎలాంటి ఊరటనిస్తారనేది ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu