Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిక్కోలు తమ్ముళ్ళను బాబు పొగిడారా లేక ?

సిక్కోలు తమ్ముళ్ళను బాబు పొగిడారా లేక ?

Tupaki.com 5 days ago

ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అనేక అంశాలను ప్రస్తావించారు. జిల్లా అభివృద్ధికి తనదైన హామీలు ఇచ్చారు. అంతే కాదు సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సాగు నీటి ప్రాజెక్టుల క్లియరెన్స్ కు షెడ్యూల్ ని కూడా ప్రకటించారు.

శ్రీకాకుళానికి ఏమి తక్కువ అని కూడా బాబు ఈ సందర్భంగా ప్రశ్నించడం విశేషం. ఎన్నో వనరులు సమృద్ధిగా ఉన్న జిల్లా శ్రీకాకుళం అని బాబు చెప్పుకొచ్చారు. అలాంటి జిల్లా అయితే ఇంకా వెనకబాటుతనం తో ఉండడమే కొంత ఆవేదనను కలిగిస్తోంది అని బాబు వ్యాఖ్యానించారు.

అందరూ ఉద్ధండ పిండాలే :

ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తెలుగుదేశం అందరూ ఉద్దండ పిండాలే అని బాబు తన ప్రసంగంలో బహిరంగానే కితాబులు ఇచ్చారు. జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అయితే గుక్క తిప్పుకోకుండా అనర్ఘళంగా మాట్లాడగల ధీటైన వక్త అన్నారు. అలాగే ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వాక్చాతుర్యాన్ని కూడా ఆయన పొగిడారు. ప్రజా సమస్యల మీద రవికుమార్ గొప్పగా మాట్లాడుతారు. అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి అందులోనే ఉన్నారని, పార్టీ కోసం కష్టించే మనిషి అన్నారు. ఇంకా జిల్లాకు చెందిన అనేక మంది దిగ్గజ నేతలు ఉన్నారని బాబు వేదిక నుంచి ఒక్క లెక్కన పొగిడారు. దాంతో పాటే ఆయన ఒక మాట అన్నారు. ఇంత మంది ఉన్నా కూడా శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెనకబడి పోయింది అన్నది అర్ధం కావడం లేదని. దాంతో నాయకులు అంతా అంతర్మధనంలో పడ్డారు.

అందరూ ఆలోచించాలి :

అన్ని వనరులు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నాయి. అలాగే నాయకులు అంతా సమర్ధులు మరి ఎక్కడ లోపం ఉంది అన్నట్లుగా బాబు వేదిక మీద నుంచే ప్రశ్నించడం ఇపుడు జిల్లా టీడీపీలో చర్చనీయాంశం అవుతోంది. పార్టీ నేతలు గొప్పగా పనిచేస్తారని చెబుతూ జిల్లాలో వనరులు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ రోజుకీ జిల్లా మాత్రం వెనుకబడి ఉందని తేల్చేశారు. దాంతో లోపం ఎక్కడ ఉందో అంతా ఆలోచించాలని బాబు కోరారు. అధికారులు ప్రజలు కూడా సహకరించాలని నాయకులు కూడా ఫోకస్ పెడితే తప్పకుండా శ్రీకాకుళం జిల్లా అగ్ర స్థానంలో ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా సహాయ సహకారాలు అందచేస్తుందని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. మొత్తానికి బాబు జిల్లా పర్యటనలో తమ్ముళను పొగిడారా లేక తెగిడారా అన్నది అయితే తెలియక అంతా చర్చించుకుంటున్నారు అని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu