Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సొంత పల్లెకు వెళ్లి 30కోట్లతో బంగ్లా కట్టుకున్న ప్రముఖ అథ్లెట్!

సొంత పల్లెకు వెళ్లి 30కోట్లతో బంగ్లా కట్టుకున్న ప్రముఖ అథ్లెట్!

Tupaki.com 0 months ago

భారతదేశ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ క్రీడావేదికలపై రెపరెపలాడించిన `గోల్డెన్ బాయ్`.. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నిర్మించుకున్న సొంత ఇల్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

హర్యానాలోని ఒక చిన్న గ్రామం నుండి క్రీడారంగంలో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన నీరజ్ మెట్రో నగరాల వైపు వెళ్లకుండా తన సొంత మూలాలను గౌరవిస్తూ హర్యానాలోనే ఒక అద్భుతమైన విలాసవంతమైన బంగ్లాను నిర్మించుకున్నారు. తాజా మీడియా కథనాల ప్రకారం.. పానిపట్ సమీపంలోని అతడి సొంత గ్రామమైన ఖండ్రా లో నిర్మించిన ఈ మూడు అంతస్తుల బంగ్లా మార్కెట్ విలువ దాదాపు రూ. 30 కోట్లుగా ఉంది. ఈ నివాసం ఈ యువక్రీడాకారుడు సాధించిన అసాధారణ విజయాలకు..అతడికి ఉన్న వినమ్రతకు అద్దం పడుతోంది.

ఈ విలాసవంతమైన బంగ్లా ఎక్స్ టీరియర్ ప్రశాంతతను పంచే తెలుపు, బేజ్ రంగుల కలయికతో పాటు ఎరుపు, బ్రౌన్ షేడ్స్ అల్లికతో ఎంతో హుందాగా డిజైన్ చేసారు.. ఇంటి ప్రధాన ప్రవేశద్వారం వద్ద బంగారు అక్షరాలతో ఉన్న `చోప్రాస్` నేమ్‌ప్లేట్‌తో పాటు, హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా `వసుధైవ కుటుంబకం` (ప్రపంచమే ఒక కుటుంబం) అనే సంస్కృత శ్లోకం ఉన్న ఫలకాన్ని అమర్చడం విశేషం. ఇది నీరజ్ చోప్రా సాంస్కృతిక వారసత్వాన్ని.. సాదాసీదా మనస్తత్వాన్ని చాటిచెబుతోంది. ఇంటి లోపలి భాగం విషయానికి వస్తే.. మినిమలిస్ట్ ఆధునిక శైలితో కూడిన లివింగ్ రూమ్, క్రీమ్ కలర్ కర్టెన్లు, బ్రౌన్ సోఫాలతో ఎంతో ఆహ్లాదకరంగా విలాసవంతంగా ఉంటుంది.

ఈ ఇంటిలో అత్యంత ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన విభాగం ఏదైనా ఉందంటే.. అది కేవలం నీరజ్ చోప్రా సాధించిన ఘనతలను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా కేటాయించిన `ఒలింపిక్ ట్రోఫీ రూమ్`. ఈ గదిలో టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి తెచ్చిన చారిత్రాత్మక స్వర్ణ పతకం, వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అతడు అందుకున్న ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు.. జ్ఞాపికలను గర్వంగా ప్రదర్శించారు. ఈ గది చూసే ప్రతి ఒక్కరికీ నీరజ్ చోప్రా పడ్డ కష్టం- క్రమశిక్షణ- పట్టుదలను గుర్తుచేస్తూ స్ఫూర్తిని నింపుతుంది. దీనితో పాటు ఈ ప్రాజెక్ట్‌లో భారీ ఎత్తున ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఏరియాను కూడా డిజైన్ చేశారు. పచ్చని చెట్లు, మొక్కలతో ఉన్న ఈ తోటలో ప్రశాంతంగా కూర్చోవడానికి కుర్చీలు- ఊయలను కూడా ఏర్పాటు చేశారు.

సెలబ్రిటీ హోదా వచ్చాక ముంబై లేదా ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో లగ్జరీ పెంట్‌హౌస్‌లు కొనుగోలు చేసే ధోరణికి భిన్నంగా నీరజ్ చోప్రా తన సొంత గ్రామంలోనే ఈ స్థాయి రియల్ ఎస్టేట్ ల్యాండ్‌మార్క్‌ను నిర్మించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ ఉన్న తమ వ్యవసాయ భూముల వీక్షణకు విశాలమైన బాల్కనీలు.. ప్రీమియం వాహనాల సేకరణ కోసం ప్రత్యేక గ్యారేజ్.. ట్రైనింగ్ కోసం అత్యాధునిక జిమ్ వంటి ఎన్నో ప్రపంచ స్థాయి వసతులు ఈ రూ. 30 కోట్ల బంగ్లాలో ఉన్నాయి. తన ఉమ్మడి కుటుంబం అంతా కలిసి నివసించేలా.. హర్యానా గ్రామీణ సంస్కృతి దెబ్బతినకుండా నిర్మించిన ఈ ఛాంపియన్ నివాసం.. కేవలం ఒక విలాసవంతమైన గృహం మాత్రమే కాదు.. కష్టపడితే గ్రామీణ యువత కూడా అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాలను అందుకోవచ్చని నిరూపించే ఒక సజీవ సాక్ష్యం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu