Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టార్ హీరో లేడీ మేనేజర్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ!

స్టార్ హీరో లేడీ మేనేజర్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ!

Tupaki.com 1 week ago

ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియాన్ 2020లో మరణించిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేత కొత్తగా విచారణ జరిపించాలని బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

సిబిఐ తక్షణమే ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి.. ఆమె తండ్రి సతీష్ సాలియాన్ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ రంజిత్ సిన్హా రాజా భోంస్లేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా.. ముంబై పోలీసులు తమ వద్ద ఉన్న ఈ కేసు ఫైళ్లు.. వివరాలన్నింటినీ వెంటనే సిబిఐకి అప్పగించాలని స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఈ తీర్పు ఒక ప్రధాన చట్టపరమైన పరిణామంగా నిలిచింది.

ఈ న్యాయపరమైన ఉత్తర్వులకు సంబంధించిన వివరాలను ప్రముఖ బాలీవుడ్ మీడియా పేజీ `వైరల్ భయానీ` సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ పోస్ట్ కింద కామెంట్లు చేసిన మెజారిటీ ప్రజలు కేసు విచారణలో జరిగిన తీవ్ర జాప్యంపై తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశ కొందరిలో ఉన్నా.. అత్యధికులు మాత్రం వ్యవస్థ తీరుపై తమ విరక్తిని కామెంట్ల రూపంలో వెళ్లగక్కారు.

ప్రధానంగా ఇన్ని సంవత్సరాల తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించడంపై నెటిజన్లు తీవ్ర అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు. సంఘటన జరిగి ఇన్నాళ్లు గడిచాక విచారణ చేపడితే లభించే ఆధారాలు ఏముంటాయని..ఈపాటికే కీలకమైన సాక్ష్యాలు నాశనమై ఉంటాయని వారు ఆరోపించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును కేంద్ర ఏజెన్సీకి అప్పగించడానికి ఎందుకింత సమయం తీసుకుందని ప్రశ్నిస్తూ.. ఈ ఆలస్యపు విచారణ కేవలం ఒక ప్రక్రియ మాత్రమే తప్ప నిజమైన న్యాయం అందించేందుకు దోహదపడదని వ్యాఖ్యానించారు.

మరోవైపు గతంలో సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్ వంటి ప్రముఖుల కేసులను ప్రస్తావిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలపై తమకున్న నమ్మకం సడలిపోయిందని పలువురు నెటిజనులు పేర్కొన్నారు. కేసును సిబిఐకి ఇవ్వడం వల్ల విచారణ కాలయాపన జరిగి మూలన పడుతుందే తప్ప... స్పష్టమైన ఫలితాలు రావని కామెంట్లు చేశారు. ప్రభావవంతమైన వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేందుకే కేసును ఇన్నాళ్లూ ఆలస్యం చేశారనే అనుమానాలను నెటిజన్లు లేవనెత్తారు.

మొత్తానికి బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు దిశా సాలియాన్ కేసును మళ్లీ తెరపైకి తెచ్చినా కానీ.. ప్రజల్లో మాత్రం తీవ్రమైన సందేహాలను నింపాయి. కుటుంబ సభ్యులకు ఈ సిబిఐ విచారణ కొంత ఆశను కలిగించినా.. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు మాత్రం న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కనబరచడం లేదు. సెలబ్రిటీల కేసులలో జరుగుతున్న తీవ్ర ఆలస్యంపై ప్రజల్లో ఉన్న అసహనానికి నెటిజన్ల కామెంట్లు అద్దం పడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu