Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థానికంలో బీసీ రిజర్వేషన్లు లేనట్లే..? చంద్రబాబు సంకేతాలు

స్థానికంలో బీసీ రిజర్వేషన్లు లేనట్లే..? చంద్రబాబు సంకేతాలు

Tupaki.com 3 hrs ago

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ఈ మేరకు సంకేతాలిచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కూటమి అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పెరగడానికి వీలు లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ నివేదికతో బీసీ రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించారు. అయితే శనివారం నివేదిక సమర్పించిన కమిషన్ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను మరో నాలుగు శాతం మేర పెంపునకు ఇబ్బంది లేదని సూచించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచనలో పడిందని అంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 23.84 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీ జనాభాకు తగినట్లు మరో 3.82 శాతం మేర రిజర్వేషన్లు పెంచడానికి మాత్రమే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం బీసీ జనాభా 50.26 శాతం కాగా, ఆ లెక్కన 27.66 శాతం వరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి సమస్య ఉండదని అంటున్నారు. అయితే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు.

ఎన్నికల హామీ అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సివుంటుంది. ఇందుకు కుల గణన జరగాలి. దేశంలో 1931 తర్వాత ఎక్కడా కుల గణన చేయలేదని అంటున్నారు. ప్రస్తుతం ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, ఈ ప్రక్రియ ముగియడానికి మరో ఏడాది పడుతుందని భావిస్తున్నారు. అయితే వచ్చేనెల నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై విస్తృతంగా సమాలోచనలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోందని చెబుతున్నారు.

ఇక రాజ్యాంగం ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాలని చూసినా సుప్రీం కోర్టు తీర్పు కారణంగా బ్రేక్ పడింది. దీంతో అక్కడ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించారని చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులతో రిజర్వేషన్లు పెంచుకోవాలని చూసినా, అందుబాటులో ఉన్న కులాల లెక్కలతో కేవలం 3.82 శాతం మేర రిజర్వేషన్లు పెంచేందుకే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికంలో బీసీ రిజర్వేషన్లపై ఆలోచన మార్చుకున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యమయ్యేలా లేదని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ మోడల్ ను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేయకపోయినా కూటమిలోని మూడు పార్టీలు కలిపి 34 శాతం స్థానాలలో బీసీలను పోటీపెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. శనివారం కూటమి పక్షాల నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని చెబుతున్నారు. దీంతో స్థానికంలో బీసీ రిజర్వేషన్ పెరిగే పరిస్థితి కనిపించడం లేదన్న విషయం స్పష్టం అవుతోందని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu