షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు రకరకాల వింతలు కనిపిస్తుంటాయి, కానీ హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ డిబేట్‌కు దారితీసింది.
స్టోర్‌కు వచ్చిన కస్టమర్లు అక్కడ ప్రదర్శనకు ఉంచిన సోఫాలు, బెడ్‌లపై హాయిగా పడుకుని, కుర్చీల్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి మరీ గట్టిగా వాదించుకుంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. ఎక్స్ లో రచ్చ:
ఈ వీడియోను మొదట 'అనామికా సింగ్ రాణా' అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. అయితే, విమర్శలు వస్తాయని ఊహించి ఆమె కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేసేశారు. కానీ, ఆ తర్వాత ఈ క్లిప్ ఎక్స్ వేదికగా వేరే యూజర్ల ద్వారా మరింత వైరల్ అయింది. ఇక ఓ యూజర్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇది కేవలం పౌర బాధ్యత లేకపోవడం మాత్రమే కాదని, భారతీయులలో పెరుగుతున్న ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల వచ్చే నీరసానికి ఇది నిదర్శనమంటూ హెల్త్ యాంగిల్‌లో గట్టిగా విమర్శించారు.
పారిశుద్ధ్యం ఎక్కడ? తప్పుబడుతున్న జనం:
ఈ వీడియోను తప్పుబడుతున్న వారు ప్రధానంగా హైజీన్ గురించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ షోరూమ్‌లలో ఇలా అందరూ పడుకుంటే పారిశుద్ధ్యం దెబ్బతింటుందని కొందరు మండిపడుతున్నారు. ఇక మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకున్న ఫర్నిచర్ పై ఎవరో తెలియని వాళ్లు పడుకోవడం, పిల్లలు షూస్‌తో సహా బెడ్‌లపై దూకుతుంటే చూడటం చిరాగ్గా ఉంటుందని, ఇలాంటి ప్రవర్తన అస్సలు బాలేదని ఫైర్ అవుతున్నారు.
కొనేముందు టెస్ట్ చేస్తే తప్పేంటి? సపోర్ట్ చేస్తున్నవారు :
అయితే, ఈ వ్యవహారాన్ని సమర్థిస్తున్న వారు కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకియా స్టోర్లలో ఫర్నిచర్ కంఫర్ట్‌ను చెక్ చేయడానికి కస్టమర్లు ఇలా కూర్చోవడం, పడుకోవడం చాలా సాధారణ విషయమని వారు వాదిస్తున్నారు. ఇక వేల రూపాయలు పెట్టి కొనేముందు అది ఎంత కంఫర్ట్‌గా ఉందో టెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పులేదని ఐకియా రూల్స్‌ను గుర్తు చేస్తున్నారు.
మారాల్సింది కస్టమర్లు మాత్రమే కాదు.. స్టోర్ మేనేజ్‌మెంట్ కూడా:
ఈ గొడవలో ఒక ప్రాక్టికల్ పాయింట్‌ను కూడా కొందరు లేవనెత్తారు. ఐకియా లాంటి భారీ స్టోర్లలో మొత్తం తిరిగి షాపింగ్ చేయాలంటే కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తుంది. ఇక దానికి చాలా సమయం పడుతుంది. కానీ అంత పెద్ద స్టోర్‌లో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు కాసేపు కూర్చోవడానికి తగినన్ని ఖాళీ స్థలాలు లేదా సాధారణ కుర్చీలు ఉండవు. షాప్ వాళ్ళు సరైన ఫెసిలిటీస్ చూపించకపోవడం వల్లే, అలసిపోయిన కస్టమర్లు తప్పక డిస్‌ప్లే ఫర్నిచర్‌ను వాడుకోవాల్సి వస్తోందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఈ వైరల్ వీడియో చూశాక మారాల్సింది ఒక్క కస్టమర్ మాత్రమే కాదు, షాప్ యాజమాన్యం కూడా అని స్పష్టమవుతోంది. కస్టమర్లు పబ్లిక్ ప్లేస్‌లో ఇతరులకు ఇబ్బంది కలగకుండా, వస్తువులు పాడవకుండా చూసుకోవాలి. అదే సమయంలో అంత పెద్ద స్టోర్ నడిపేవాళ్లు కూడా కస్టమర్ల అలసటను గుర్తించి, అక్కడక్కడా ఫ్రీగా కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్‌మెంట్స్ చేయాలి. అప్పుడే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉంటాయి.

