Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సునీల్ నారంగ్ రాజీనామా.. సడెన్ డిసెషన్ ఎందుకు?

సునీల్ నారంగ్ రాజీనామా.. సడెన్ డిసెషన్ ఎందుకు?

Tupaki.com 4 days ago

థియేటర్ల రెంటల్ విధానం, పర్సంటేజ్ సిస్టమ్‌ పై కొన్ని రోజులుగా టాలీవుడ్‌ లో జరుగుతున్న చర్చ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కొద్దిరోజులుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న వాగ్వాదాల్లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఇటీవల నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత నిర్మాత నాగవంశీ ఇచ్చిన కౌంటర్లు పెద్ద చర్చకు దారితీశాయి.

అదే సమయంలో తాజాగా సునీల్ నారంగ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం మరింత హాట్ టాపిక్‌ గా మారింది. తన మూడో టర్మ్ అధ్యక్ష పదవీకాలంలో కొనసాగుతున్న ఒత్తిళ్లు, అంతర్గత విభేదాలు, ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఛాంబర్ ప్రతినిధులకు ఆయన రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం. ముఖ్యంగా కొందరు ఆఫీస్ బేరర్లు సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని సునీల్ నారంగ్ లేఖలో ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

"నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఎప్పుడూ పని చేయలేను. ఫిలిం ఛాంబర్ వంటి వ్యవస్థ అందరి ఏకాభిప్రాయంతో నడవాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు" అని సునీల్ నారంగ్ తన లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన ఆరోగ్య పరిస్థితి కూడా బాధ్యతలు నిర్వహించడానికి సరిగా సహకరించడం లేదని పేర్కొన్నారు. వెంటనే తనను అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఛాంబర్ కమిటీని ఆయన కోరారు.

ఇక తన స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు ఇండస్ట్రీకి చెందిన శేఖర్ లేదా విజేందర్ పేర్లను కూడా ఆయన సూచించడం ఆసక్తికరంగా మారింది. ఛాంబర్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే తెలుగు ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ ఉన్న సీనియర్ నిర్మాతగా గుర్తింపు ఉన్న సునీల్ నారంగ్ ఇలా సడెన్ గా పదవి నుంచి తప్పుకోవడం వెనుక అసలు కారణాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

అదే సమయంలో గతంలో కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 24 గంటలు గడవకముందే ఒకసారి రాజీనామా ప్రకటించారు సునీల్ నారంగ్. తనను సంప్రదించకుండా కొందరు వ్యక్తులు ప్రకటనలు జారీ చేస్తున్నారని, అలాంటి నిర్ణయాలకు తాను బాధ్యత వహించబోనని అప్పట్లో స్పష్టం చేశారు. అనంతరం పెద్దల జోక్యంతో తిరిగి అధ్యక్ష బాధ్యతలు కొనసాగించారు. కానీ ఇప్పుడు మళ్లీ సడెన్ గా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

ఇటీవల థియేటర్ల వ్యవహారంపై జరిగిన వివాదాల నేపథ్యంలో ఛాంబర్‌ లో అంతర్గత విభేదాలు మరింత బయటపడినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా రెంటల్ సిస్టమ్, పర్సంటేజ్ విధానం, నిర్మాతల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు కూడా ఆ పరిణామాలకు కారణమయ్యాయనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇప్పుడు సునీల్ నారంగ్ రాజీనామాను ఛాంబర్ పెద్దలు ఆమోదిస్తారా? లేక మరోసారి బుజ్జగించే ప్రయత్నం చేస్తారా? అన్నది ఇప్పుడు అంతా వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu