Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ కరెక్షన్ మోడ్: హీరోలు - దర్శకుల పారితోషికాల కోత!

టాలీవుడ్ కరెక్షన్ మోడ్: హీరోలు - దర్శకుల పారితోషికాల కోత!

Tupaki.com 1 week ago

భారతీయ సినీ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలకమైన మార్పు దిశగా అడుగులు వేస్తోంది. అదుపు తప్పుతున్న నిర్మాణ వ్యయం, ఆకాశాన్ని తాకుతున్న నటీనటుల పారితోషికాల వల్ల నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమలు `కాస్ట్ కటింగ్` (ఖర్చుల కోత) మోడ్‌లోకి వెళ్లగా.. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. సినిమా బడ్జెట్‌ను గాడిలో పెట్టేందుకు హీరోలు, అగ్ర దర్శకుల పారితోషికాల్లో కోత విధించే విప్లవాత్మక నిర్ణయాల దిశగా టాలీవుడ్ అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమను ఓటీటీ ఆదాయం తగ్గుదల ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ మొత్తాలు వచ్చేవి.. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఆచితూచి ఖర్చు చేస్తున్నాయి. మరోవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కేవలం బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప సామాన్య ప్రేక్షకుడు థియేటర్ మెట్లు ఎక్కడం లేదు. ఈ బాక్సాఫీస్ గండం నుంచి గట్టెక్కాలంటే హీరోల మార్కెట్ పరిధిని మించి ఖర్చు చేయకూడదని.. అనవసరపు హంగులకు స్వస్తి పలకాలని నిర్మాతలు గట్టిగా నిర్ణయించుకున్నారు.

కేవలం హీరోల పారితోషికాలే కాకుండా భారీ మొత్తాలు అందుకునే అగ్ర టెక్నీషియన్లు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల జీతాల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. పరిశ్రమ మనుగడ సాగించాలంటే నిర్మాణ వ్యయంలో కచ్చితమైన కట్టుబాట్లు ఉండాలని నిర్మాతల మండలి భావిస్తోంది. దీనిపై త్వరలోనే వరుస చర్చా సమావేశాలు నిర్వహించి, పారితోషికాల రేంజ్ గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రానున్నారని కథనాలొస్తున్నాయి.

ఇటీవల దక్షిణ భారత సినీ పరిశ్రమలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్న తరుణంలో, ఈ పారితోషికాల కోత అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాతను ముంచేస్తున్న అనవసరపు ఖర్చులన్నింటిపైనా ప్రధానంగా చర్చించి పరిశ్రమను సంక్షోభం నుంచి కాపాడుకోవాలని అందరూ భావిస్తున్నారు. అగ్ర హీరోల నుండి కింది స్థాయి నటుల వరకు అందరూ పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా కొంత తగ్గి ఉండాలని మేకర్స్ కోరుతున్నారు.

సినిమా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. అది వేల మందికి జీవనోపాధిని ఇచ్చే ఒక వ్యాపారం. కాబట్టి ఈ కరెక్షన్ మోడ్ ద్వారా బడ్జెట్లను నియంత్రించి.. కంటెంట్‌పై ఎక్కువ పెట్టుబడి పెట్టేలా మార్పులు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. హీరోలు- దర్శకులు ఈ మార్పులకు సహకరిస్తేనే టాలీవుడ్ భవిష్యత్తు బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జరగబోయే కీలక సమావేశాలు పరిశ్రమలో కొత్త నియమ నిబంధనలకు పునాది వేయనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu