Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు కంటే ముందే కేరళం సంచలనం.. దేశంలోనే తొలి ఏఐ శాఖ!

తమిళనాడు కంటే ముందే కేరళం సంచలనం.. దేశంలోనే తొలి ఏఐ శాఖ!

Tupaki.com 3 days ago

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే కేరళం రాష్ట్రం దేశంలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పాలనలో సంస్కరణలు తీసుకువచ్చారు.

దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వీడీ సతీషన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి తమిళనాడు ఎన్నికల సమయంలో తాను గెలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేకంగా ఒక శాఖ ఏర్పాటు చేస్తానని దళపతి విజయ్ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందుగానే కేరళంలో ముఖ్యమంత్రి విడీ సతీషన్ ఏఐ శాఖను ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.

ఇక కేరళంలో నూతనంగా ప్రారంభించిన ఏఐ మంత్రిత్వ శాఖను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక (IT) విభాగాలతో అనుసంధానించారు. ఈ హైటెక్ శాఖకు టెక్నాలజీపై పూర్తి పట్టున్న ఏ యువ నాయకుడికో బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, ముఖ్యమంత్రి సతీషన్ మాత్రం ఈ కీలక బాధ్యతను సీనియర్ నాయకుడికి అప్పగించి ఆశ్చర్యపరిచారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)కు చెందిన 74 ఏళ్ల పి.కె. కున్హాలికుట్టికి ఏఐ శాఖ బాధ్యతలు అప్పగించడంతో దేశంలో తొలి ఏఐ మంత్రిగా ఆయన రికార్డు స్థాపించారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈ కొత్త విభాగాన్ని పటిష్ఠం చేయడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సతీషన్ భావిస్తున్నారని అంటున్నారు.

ఏఐ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది?

మలయాళ మీడియా; ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ శాఖ కేవలం ఒక నామమాత్రపు సాంకేతిక విభాగంగా కాకుండా, రోజువారీ ప్రభుత్వ పాలనను పూర్తిగా డిజిటలైజ్ చేసి, ప్రజలకు వేగవంతమైన, అవినీతి రహిత సేవలు అందించేలా పనిచేస్తుందని చెబుతున్నారు. కేరళం ఏఐ మిషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలను కృత్రిమ మేధస్సుతో అనుసంధానించనున్నారని అంటున్నారు. రాష్ట్రం తరచూ ఎదుర్కొనే వరదలు, ప్రకృతి విపత్తులను ముందే అంచనా వేసేందుకు 'ప్రిడిక్టివ్ అనలిటిక్స్'ను సమర్థంగా వినియోగించే బాధ్యతను ఏఐ మంత్రత్వ శాఖకు అప్పగించారు. ఇక భూగర్భ వనరుల నిర్వహణ, రోగాలను ముందే గుర్తించడం, రైతులకు వాతావరణం, పంటలపై ఏఐ ఆధారిత మేలైన సలహాలు అందించడం ఈ శాఖ ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు.

అదేవిధంగా స్థానిక పరిపాలనలో సర్టిఫికెట్ల జారీ, పన్నుల చెల్లింపులను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చి ప్రజలకు సులభతరం చేయనున్నారని అంటున్నారు. నిజానికి తమిళనాడులో నూతనంగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని 'తమిళ వెట్రి కళగం' (TVK) ప్రభుత్వం, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. అయితే, తమిళనాడు ఆ దిశగా అడుగులు వేసేలోపే, కేరళలోని కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసి దేశంలోనే 'ఫస్ట్'గా నిలిచిందని ప్రశంసలు అందుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu