బీజేపీ నాయకత్వంలోని కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ల విషయంలో ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ వస్తోంది. అలా చూస్తే తెలంగాణాలో విద్యా సాగర్ రావును మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్ గా పనిచేసే చాన్స్ ఇచ్చింది.
హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాష్ట్రాలకు బండారు దత్తాత్రేయ గవర్నర్ గా పనిచేశారు. అదే విధంగా తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇక ఏపీకి చెందిన సీనియర్ నాయకుడు బీజేపీ దిగ్గజ నేత ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. అదే ఏపీ నుంచి విశాఖకు చెందిన కంభంపాటి హరిబాబు మిజోరాం , ఒడిషా రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. తాజాగా ఆరుగురు కొత్త గవర్నర్ల నియామకం తరువాత ఒడిషాకు హరిబాబు స్థానంలో బ్రజ్ మోహన్ రామ్ నియమితులయ్యారు. దాంతో గత అయిదేళ్ళుగా పనిచేస్తున్న హరిబాబు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి :
ఇక చూస్తే ఎంతో మంది గవర్నర్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పనిచేస్తూ వచ్చారు. 2014 నుంచి 2026 మధ్యలో మోడీ ప్రభుత్వ హయంలో చూస్తే చాలా మందికి గవర్నర్లుగా అవకాశం దక్కింది. అయితే ప్రస్తుతం ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా ఉన్నారు. అలాగే ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా ఉన్నారు. ఈ ఇద్దరే రాజ్ భవన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి కొందరు నేతలు గవర్నర్లుగా చాన్స్ కోసం చూస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురి పేర్లు రేసులో ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎవరికీ చాన్స్ అయితే ఇవ్వలేదు. దాంతో గతంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలకు గవర్నర్లు గా అవకాశాలు తగ్గిపోయాయని అంటున్నారు.
కీలకంగా రాజ్ భవన్ :
మారుతున్న రాజకీయ పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో రాజ్ భవన్లు అత్యంత కీలకంగా మారుతున్నాయి. అంతే కాదు గవర్నర్ల పాత్ర కూడా అతి ముఖ్యమైనదిగా ఉంటోంది. ఆ మధ్య చూస్తే తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఎలా వ్యవహరించారో అంతా చూశారు. నంబర్ గేమ్ గా మారిన తమిళ ముఖ్యమంత్రి పీఠం విషయంలో పక్కాగా లెక్కలు అన్నీ చూసుకుని మరీ విజయ్ ని ఆహ్వానించారు. ఈ సమయంలో ఎటువంటి విమర్శలు వచ్చినా కూడా రాజ్ భవన్ నిబంధనలను పాటించింది అని గుర్తు చేస్తున్నారు. అలాగే జాతీయ గీతాల ఆలాపన విషయంలో కూడా గవర్నర్లు ప్రభుత్వానికి సూచనలు చేస్తూ వస్తున్న సందర్భాన్ని చూశారు.
ఏరి కోరి ఎంపిక :
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లకు గవర్నర్లుగా చేసిన మాజీ బీజేపీ నేతలు గట్టిగా ఉంటూ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఒకటికి పది సార్లు పరిశీలిస్తూ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తుంటున్నారు. అందువల్ల ఒకప్పుడు గవర్నర్ పదవి అంటే హోదా దర్జా కానీ ఇపుడు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతో రాజ్యాంగపరమైన అంశాల మీద అవగాహనతో పాటు నిబద్ధత పట్టు ఉన్న వారిని ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న వారిని ఏరి కోరి బీజేపీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో గవర్నర్లుగా పంపుతోంది అని గుర్తు చేస్తున్నారు.

