Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రేడ్‌మార్క్ వివాదంలో సంచలన స్టార్!

ట్రేడ్‌మార్క్ వివాదంలో సంచలన స్టార్!

Tupaki.com 1 week ago

ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ మరోసారి న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. మాలిబు కేంద్రంగా పనిచేసే పురుషుల ఇంటిమేట్ స్కిన్‌కేర్ సంస్థ బో డి బ్రాడ్ పిట్ పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన ఆరోపణలతో కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది.

బ్రాడ్ పిట్ తన చర్మ సంరక్షణ బ్రాండ్ పేరును మార్చడం ద్వారా తమ సంస్థ పేరును పోలినట్లుగా ఉపయోగించారని ఇది వినియోగదారులలో గందరగోళానికి దారితీస్తోందని సదరు కంపెనీ ఆరోపించింది. బ్రాడ్ పిట్ 2022లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వైన్ తయారీ కుటుంబం పెరిన్ భాగస్వామ్యంతో ఒక విలాసవంతమైన స్కిన్‌కేర్ లైన్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో దీనికి లె డొమైన్ అని పేరు పెట్టారు.

అయితే గతేడాది వ్యాపార విస్తరణ .. బ్రాండ్ పునఃస్థాపన ప్రక్రియలో భాగంగా ఈ బ్రాండ్ పేరును `బో డొమైన్` గా మార్చారు. ఈ పేరు మార్పే ఇప్పుడు తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మాలిబుకు చెందిన చిన్న తరహా బ్రాండ్ బో డి 2020లోనే మార్కెట్లోకి ప్రవేశించింది. పురుషుల అంతరంగిక భాగాల సంరక్షణ కోసం ప్రత్యేక క్రీములు .. లిప్ బామ్స్ తయారు చేసే ఈ సంస్థ, బ్రాడ్ పిట్ మార్చుకున్న బో డొమైన్ అనే పేరు తమ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను పోలి ఉందని వాదిస్తోంది. తమ బ్రాండ్ గుర్తింపును దెబ్బతీసే విధంగా ఈ పేరు ఉందని దీంతో వ్యాపారపరంగా నష్టం వాటిల్లుతుందని కాలిఫోర్నియా బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్ కోడ్ కింద సదరు సంస్థ కేసు నమోదు చేసింది.

కోర్టు మెట్లు ఎక్కడానికి ముందే ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి బో డి వ్యవస్థాపకుడు బ్రాండన్ పాలాస్ మూడు సార్లు ప్రయత్నించినట్లు వెల్లడించారు. బ్రాడ్ పిట్ బ్రాండ్ రీబ్రాండింగ్ చేసుకోవడం లేదా తమకు నష్టపరిహారం చెల్లించడం వంటి ప్రతిపాదనలను తాము మంచి ఉద్దేశ్యంతో ముందుంచామని తెలిపారు. బ్రాడ్ పిట్ భాగస్వాములు తమ బ్రాండ్ పేరు మార్చడానికి నిరాకరించడంతో పాటు.. ఆర్థిక సాయంపై జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో చివరకు న్యాయపోరాటానికి దిగాల్సి వచ్చిందని పాలాస్ పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యం ద్వారా బో డి సంస్థ దాదాపు 75000 డాలర్ల కంటే ఎక్కువ నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు బ్రాడ్ పిట్ సంస్థ బో డొమైన్ అనే పేరును శాశ్వతంగా ఉపయోగించకుండా నిలిపివేయాలని కోర్టును కోరింది. తాజా న్యాయపరమైన చిక్కులపై ఇప్పటి వరకు బ్రాడ్ పిట్ కానీ.. ఆయన బ్రాండ్ ప్రతినిధులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే బ్రాడ్ పిట్ తన మాజీ భార్య ఏంజెలీనా జోలీతో కలిసి గతంలో కొనుగోలు చేసిన ఫ్రెంచ్ వైన్ యార్డ్ చాటౌ మిరవాల్ వాటాల విక్రయానికి సంబంధించి సుదీర్ఘ కోర్టు పోరాటంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ వివాదం కొనసాగుతుండగానే తాజాగా సొంత బిజినెస్ బ్రాండ్ పేరు విషయంలో మరో కొత్త కేసు వచ్చి పడటం ఆయనకు గట్టి ఎదురుదెబ్బగానే భావించొచ్చు. ఈ కొత్త వివాదం కోర్టు వెలుపల సర్దుబాటు అవుతుందా లేదా అనేది త్వరలో తేలనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu