Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రెండీ టాక్: భారతీయ సినీ పరిశ్రమల్లో 'అగ్లీ గొడవలు'- టాలీవుడ్ ఇంతేనా!

ట్రెండీ టాక్: భారతీయ సినీ పరిశ్రమల్లో 'అగ్లీ గొడవలు'- టాలీవుడ్ ఇంతేనా!

Tupaki.com 1 week ago

ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతలు - ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న పోరు పరాకాష్టకు చేరుకుంది. ఇది కేవలం పరిశ్రమ సమస్యగానే కాకుండా..వ్యక్తిగత దూషణల పర్వంగా మారడం విచారకరం.

యువ నిర్మాతలు నాగవంశీ, మైత్రీ రవిశంకర్ వంటి వారు ప్రముఖ ఎగ్జిబిటర్ ఏషియన్ నారంగ్‌పై నేరుగా విమర్శలు గుప్పించడం, దానికి ప్రతిగా నారంగ్ కౌంటర్లు ఇవ్వడం ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తోంది. స్థలం దొరికితే సింగిల్ థియేటర్ వ్యాపారాన్ని లాగేస్తూ ఎక్కడపడితే అక్కడ మల్టీప్లెక్సులు కట్టేస్తున్నారంటూ నారంగ్ పై నాగవంశీ సెటైర్ వేయడం, ఆపై మైత్రి రవిశంకర్ ఈయనేంటి సింగిల్ థియేటర్ల గురించి మాట్లాడటమా? అంటూ నారంగ్ పై పంచ్ విసరడం.. ఫలితంగా ఏషియన్ నారంగ్ నేరుగా బరిలో దిగి `ప్రత్యర్థిని అంతం చేయ్` అనే తన తండ్రి చెప్పిన సూక్తిని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం వంటి పరిణామాలు టాలీవుడ్‌లో `అగ్లీ` గొడవలు మొదలయ్యాయా అన్న చర్చకు దారితీస్తున్నాయి. అయితే, ఈ వివాదం కేవలం ఆర్జన- మనుగడ కోసం జరుగుతున్న పోరాటం మాత్రమేనని, దీనిని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ గొడవలు అంత ఘోరమైనవి కావనే చెప్పాలి. ఉదాహరణకు మాలీవుడ్ (మలయాళం) ను తీసుకుంటే అక్కడ కొన్నేళ్ల క్రితం ఒక ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్- అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అగ్ర హీరోల పేర్లు బయటకు రావడం, మహిళా కమిషన్లు, సిట్ దర్యాప్తు వంటివి ఆ పరిశ్రమ పరువును బజారున పడేశాయి. నిర్మాతల్లో వర్గపోరు కూడా అక్కడ తీవ్రంగా ఉంటుంది. అటువంటి నేరపూరిత .. అమానవీయ ఘటనలతో పోలిస్తే టాలీవుడ్‌లో ఇప్పుడు జరుగుతున్న మాటల యుద్ధం కేవలం వ్యాపారపరమైన విభేదాలకే పరిమితమైంది.

బాలీవుడ్‌లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంటుంది. అక్కడ స్టార్ హీరోలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగిన సందర్భాలు అనేకం. పార్టీల్లో స్టార్ల మధ్య జరిగే ఫైటింగులు, సల్మాన్ ఖాన్ వంటి వారిపై వివేక్ ఒబెరాయ్ లాంటి నటులు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం, ప్రియుడి కోసం హీరోయిన్లు డైరెక్ట్ క్యాట్ ఫైట్ లకు దిగడం అక్కడ సర్వసాధారణం. `దురంధర్` వంటి భారీ విజయాలను కూడా అక్కడి స్టార్లు మనస్ఫూర్తిగా అభినందించలేకపోవడం వారి సంకుచిత మనస్తత్వాన్ని చూపిస్తుంది. ఇక శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ మాఫియా కలకలం, గోల్డ్ స్మగ్లింగ్ వంటి కేసులలో హీరయిన్ల ప్రమేయం ఆ పరిశ్రమ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి.

వాస్తవానికి ఇతర పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ హీరోలు, సినీ పెద్దల హుందాతనం చాలా గొప్పది. కరోనా కష్టకాలంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ టాలీవుడ్ స్పందించిన తీరు ఆదర్శవంతం. మన స్టార్ హీరోలు ఒకరి సక్సెస్‌ను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం, ఒకరి చిత్రాలను మరొకరు ప్రమోట్ చేయడం వంటి స్నేహపూర్వక వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. బయటి వ్యక్తులకు విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా, ఆపదలో ఉన్నప్పుడు అందరూ ఒక్కటిగా నిలబడటం టాలీవుడ్ ప్రత్యేకత. ఇక ప్రముఖ నిర్మాతలు ఎగ్జిబిటర్లు నష్టపోయినప్పుడు వారిని ఆదుకునేందుకు మన స్టార్ హీరోలు, నిర్మాతలు ముందుకు వచ్చిన సందర్భాలున్నాయి.

థియేటర్ల రాజకీయాలు, ఎగ్జిబిషన్ రంగంలో గుత్తాధిపత్యం వంటి సమస్యలు అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉన్నాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ సమస్యలపై ఫోకస్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి పెద్దవిగా కనిపిస్తున్నాయి. కానీ, ఇది కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం జరుగుతున్న ఘర్షణ మాత్రమే. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని సమన్వయంతో ముందుకు వెళ్తే ఈ మంటలు చల్లారడం పెద్ద కష్టమేమీ కాదు. ఇతర పరిశ్రమల్లోని నేరపూరిత వివాదాలతో పోలిస్తే.. మన టాలీవుడ్ ఇంకా ఎంతో గౌరవప్రదంగానే ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu