Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వారికిదే చివరి కేబినెట్ మీట్ ?

వారికిదే చివరి కేబినెట్ మీట్ ?

Tupaki.com 3 days ago

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవులు పొంది రెండేళ్ళు దాటుతున్న వారిలో కలవరం రేగుతోంది. మొత్తం 71 మంది దాకా ఉన్నారు. వీరిలో ప్రధాని మోడీ కాకుండా 30 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు.

మరో ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులుగా ఉంటే 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. అంటే మోడీని మినహాయిస్తే అక్షరాల 71 నెంబర్ అన్న మాట. కేంద్ర ప్రభుత్వం 82 మంది దాకా మంత్రులను తీసుకోవచ్చు. కానీ 11 ఖాళీలతోనే రెండేళ్ళ మోడీ పాలన సాగింది. మరి ఈసారి మంత్రి వర్గం విస్తరిస్తారు అలాగే పునర్వ్యవస్థీకరణ చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్న నేపధ్యంలో మోడీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతోంది.

అందరికీ ఆహ్వానం :

ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అంటే సహాయ మంత్రులు 36 మందితో కలిపి అంతా కేబినెట్ కి హాజరవుతారు అని అంటున్నారు. ఒక విధంగా సంపూర్ణమైన ఈ మంత్రివర్గ భేటీ రెండేళ్ళ మోడీ పాలనని పూర్తిగా సమీక్ష చేస్తుందని అంటున్నారు. అంతే కాదు దేశీయ అంతర్జాతీయ పరిణామాలను కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు అని అంటున్నారు. పశ్చిమ ఆసియా సంక్షోభం, ఇంధన పరిరక్షణ వ్యూహాలు దేశంలో వాటిని అమలు చేసే విధానాలపైన కేంద్ర మంత్రివర్గం దృష్టి సారిస్తుందని చెబుతున్నారు.

పనితీరు మీద అంచనా :

ఇక కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం సాయంత్రం అయిదు గంటలకు జరగనుందని చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ ఆర్థిక వ్యూహాలే ప్రధాన అజెండాగా ఉండబోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పనితీరు ప్రస్తుత పదవీకాలానికి సంబంధించిన ఫలితాలను కూడా అంచనా వేస్తారు అని అంటున్నారు ఇక మోడీ కేబినెట్ భేటీ పూర్తి స్థాయిలో జరుగుతోంది కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ముహూర్తం ఫిక్స్ :

ఇక కేంద్ర కేబినెట్ విస్తరణ అలాగే పునర్వ్యవస్థీకరణకు జూన్ రెండవ వారం ముహూర్తంగా నిర్ణయించారు అని అంటున్నారు. దాంతో ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు తీరు కూడా చర్చిస్తారు.

రాజకీయ వర్గాల్లో సైతం ఇదే విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులలో ఎంతమంది విస్తరణ, పునర్వ్యవస్థీకరణ తరువాత కొనసాగుతారు అన్నది కూడా చర్చగా ఉంది. మూడవ వంతు మందిని తప్పిస్తారు అని ఒక ప్రచారం హస్తిన వర్గాలలో ఉంది. అంటే 71 మందిలో పాతిక మంది దాకా మాజీలు అవుతారా అన్నదే ఇపుడు కాక రేపుతోంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ప్రతీ మంత్రికి సంబంధించిన పనితీరు అంచనాలు వివరాలు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu