Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చే ఏడాది నుంచి ప్లాస్టిక్ నోట్లు.. పాత కరెన్సీ పరిస్థితి ఏంటంటే?

వచ్చే ఏడాది నుంచి ప్లాస్టిక్ నోట్లు.. పాత కరెన్సీ పరిస్థితి ఏంటంటే?

Tupaki.com 2 weeks ago

భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుడుతోంది. కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది.

బుధవారం ద్రవ్య విధాన కమిటీ సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి దశలో రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యంతో ఆర్‌బీఐ పనిచేస్తోందని తెలిపారు.

గవర్నర్ వివరాల ప్రకారం.. పాలిమర్ నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు వివిధ వాతావరణ పరిస్థితులు, వినియోగ పరిస్థితుల్లో విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే 2028 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ కొత్త నోట్లు చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. తొలి దశలో రూ.10, రూ.20 విలువ కలిగిన సుమారు 100 కోట్ల పాలిమర్ నోట్లతో ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నోట్ల పనితీరును పరిశీలించిన తర్వాత వాటిని దశలవారీగా విస్తృతంగా చలామణిలోకి తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

అయితే ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయనే కారణంగా ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉన్న కాగితపు నోట్లు చెల్లుబాటు కాకుండా పోతాయనే ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న కాగితపు నోట్లు యథావిధిగా చెలామణిలో కొనసాగుతాయి. పాలిమర్ నోట్లు కూడా వాటితో పాటు సమాంతరంగా వినియోగంలో ఉంటాయి. ప్రస్తుతం కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేసే ప్రతిపాదన ఏదీ లేదని అధికారులు తెలిపారు.

పాలిమర్ నోట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీరు తగిలినా, దుమ్ము పట్టినా, తరచూ మడిచినా లేదా ఎక్కువ కాలం వినియోగించినా త్వరగా దెబ్బతినవు. అలాగే నకిలీ నోట్ల తయారీని అరికట్టడంలో కూడా పాలిమర్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

ప్రపంచంలో తొలిసారిగా 1988లో ఆస్ట్రేలియా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలు ఈ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తుండటంతో దేశ కరెన్సీ వ్యవస్థలో ఇది మరో కీలక సంస్కరణగా నిలవనుంది. ఫీల్డ్ ట్రయల్స్ ఫలితాలను బట్టి పాలిమర్ నోట్ల వినియోగాన్ని మరిన్ని డినామినేషన్లకు విస్తరించే అవకాశాలపై కూడా ఆర్‌బీఐ భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu