Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైఎస్ వర్ధంతి వేళ వైఎస్ సన్నిహితుడు బాబుతో !

వైఎస్ వర్ధంతి వేళ వైఎస్ సన్నిహితుడు బాబుతో !

Tupaki.com 2 weeks ago

వైఎస్సార్ పదిహేడవ వర్ధంతిని రెండు తెలుగు రాష్ట్రాలలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పెద్దాయనను అంతా గుర్తు చేసుకుని పాత జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

వైఎస్సార్ తో అనుబంధం ఉన్న వారు అంతా ఆయనతో తమ తీపి గురుతులను నెమరేసుకున్నారు. వైఎస్సార్ అనుచరులు కానీ సహచరులు కానీ ఇపుడు ఉమ్మడి ఏపీలో చెల్లా చెదురైపోయారు. వైసీపీలో కొందరు ఉంటే ఏపీ కాంగ్రెస్ తెలంగాణా కాంగ్రెస్ లో మరి కొందరు ఉన్నారు. ఇక టీడీపీ జనసేన, బీజేపీలో కూడా ఆయనతో పనిచేసిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే వైఎస్సార్ కి ఉమ్మడి విశాఖలో అత్యంత సన్నిహితుడైన నేత ఎవరు అంటే ఠక్కున చెప్పే ఒకే ఒక పేరు కొణతాల రామకృష్ణ అని. ఆయన 1989లో తొలిసారి అనకాపల్లి నుంచి ఎంపీ అయి ఢిల్లీలో అడుగుపెట్టారు.

పెనవేసుకున్న బంధం :

ఇక అదే సమయంలో కడప నుంచి తొలిసారి ఎంపీగా గెలిచి వైఎస్సార్ కూడా ఢిల్లీలో అడుగుపెట్టారు. వైఎస్సార్ కి రాయలసీమ నేతల తర్వాత ఉత్తరాంధ్రా నేతలతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరాంధ్ర కాంగ్రెస్ అగ్ర నేత నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఉండేవారు. ఆయన ద్వారా కొణతాల రామక్రిష్ణకు వైఎస్సార్ తో పరిచయం ఏర్పడింది. యువకుడిగా ఉండడంతో తొందరగానే కొణతాల వైఎస్సార్ ల మధ్య స్నేహ బంధం ఏర్పడింది. ఇలా ఇద్దరూ కలసి 1996 దాకా అంటే ఏడేళ్ల పాటు పార్లమెంట్ లో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వైఎస్సార్ ఉత్తరాంధ్ర పర్యటనలకు వస్తే కొణతాల ఏర్పాట్లు చూసేవారు అని చెబుతారు.

టీం మెంబర్ గా :

ఇక వైఎస్సార్ తో ఒకసారి బంధం కుదిరింది అంటే అది చివరి దాకా అన్నది రాజకీయ నానుడి. అలాగే కొణతాల విషయంలోనూ జరిగింది. వైఎస్సార్ టీం లో కీలక మెంబర్ గా కొణతాల ఉంటూ వచ్చారు. వైఎస్సార్ పాదయాత్ర ఉత్తరాంధ్రాలో జరిగినపుడు వెన్నంటి ఉన్నారు. ఇక 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయితే కొణతాల ఉమ్మడి విశాఖ జిల్లాకు అయిదేళ్ల పాటు ఏకైక మంత్రిగా హవా చలాయించారు. కీలకమైన వాణిజ్య పన్నులు తదితర శాఖలను ఆయన చూశారు. వైఎస్సార్ కి ఎంతో విశ్వాసపాత్రుడిగా కొణతాల ఉంటూ వచ్చారు. 2009లో వైఎస్సార్ మరణించేవరకూ అదే కొనసాగింది. ఆ తరువాతనే కొణతాల వైసీపీలోకి వెళ్లి బయటకు వచ్చారు. ఆ మధ్యలో టీడీపీతో కలిసి తిరిగినా 2024 ఎన్నికల నాటికి జనసేన అభ్యర్ధిగా అనకాపల్లి నుంచి పోటీ చేసి అనూహ్యంగా గెలిచి ఎమ్మెల్యే అయిపోయారు.

బాబు వెంట కనిపించి :

ఇదిలా ఉంటే వైఎస్సార్ వర్ధంతి వేళ కొణతాల టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కనిపించారు. ఆయనతో కలిసి ఉత్తరాంధ్రాలో పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబుతో కొణతాల ముచ్చట్లు బాబు కూడా ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవన్నీ చూసిన వారికి ఆసక్తిని కలిగించాయి. వైఎస్సార్ కి అత్యంత విధేయుడు అయిన కొణతాల ఇపుడు చంద్రబాబుతో ఎంతో అభిమానంతో పాటు ఆదరణను అందుకుని కనిపించడం మామూలుగా అయితే విడ్డూరం కావచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని అంటున్నారు. అయితే కొణతాల పాల్గొన్న కార్యక్రమం కూడా వైఎస్సార్ ప్రాణప్రదంగా భావించినదే అని గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరుతో పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి నీటిని తీసుకుని రావాలని వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు సంకల్పించారు. అపుడు మంత్రిగా ఉన్న కొణతాల ఈ విషయంలో కృషి చేశారు. ఇన్నాళ్ళకు అది సాకారం కావడం అది కూడా వైఎస్సార్ వర్ధంతి వేళనే జరగడం కొణతాల కూడా పాలు పంచుకోవడం వైఎస్సార్ అభిమానులకు ఒకింత సంతృప్తిగానే ఉంది అని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu