Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైఎస్సార్ చివరి కోరిక ...జగన్ ఓకేనా ?

వైఎస్సార్ చివరి కోరిక ...జగన్ ఓకేనా ?

Tupaki.com 2 weeks ago

వైఎస్సార్ అంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి అందులోనే పదవులు అందుకుని చివరికి ఆ పార్టీ జెండా కప్పుకుని కన్ను మూసిన నాయకుడు. వైఎస్సార్ జీవించి ఉన్నంతవరకూ కాంగ్రెస్ శ్రేయస్సు కోరుకున్నారు.

అలాగే తనకు పదవులు దక్కకపోయినా దశాబ్దాల పాటు నిరీక్షించారు. తనకు అనుకూలమైన సమయం చూసుకుని మళ్ళీ ముందుకు అడుగులు వేశారు. నిజానికి వైఎస్సార్ పీసీసీ చీఫ్ గా చిన్న వయసులోనే పదవి అందుకోవడంతో ఆయనకు అన్ని జిల్లాలోని నేతలతో అనుబంధం ఎక్కువగా ఉంది. అది ఆ తరువాత కూడా కంటిన్యూ అయింది. దాంతో వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నా లేక అధికార పదవులు చేపట్టకపోయినా కూడా పెద్ద ఎత్తున అనుచర గణం వివిధ జిల్లాలో ఉండేది. అది ఆయనను తక్కువ సమయంలోనే దిగ్గజ నేతగా మార్చింది.

ఎదురు చూసి కూడా :

ఇక వైఎస్సార్ గురించి చెప్పుకోవాలంటే ఆయన కాంగ్రెస్ నుంచి వీడిపోవాలని ఎన్నడూ అనుకోలేదు, ముఖ్యంగా 1989 నుంచి 1994 మధ్యలో ముగ్గురు సీఎంలను కాంగ్రెస్ మార్చింది. మార్చిన ప్రతీసారీ వైఎస్సార్ పేరు వినిపించడం చివరికి ఆయనకు కాకుండా వేరొకరికి ఆ పదవి దక్కడం జరిగింది. ఆ సమయంలో వైఎస్సార్ అభిమానులు అనుచరులు ఆయన కంటే ఎక్కువగా ఆవేదనకు గురి అయ్యారు. వారంతా అయితే వైఎస్సార్ ని వేరే పార్టీని పెట్టమని తీవ్రంగా ఒత్తిడి చేశారు అని ప్రచారంలో ఉంది. అయితే వైఎస్సార్ మాత్రం కాంగ్రెస్ నే తన తల్లిగా భావించి అందులోనే కొనసాగేందుకు ఇష్టపడ్డారు. ఫలితంగా ఆయన 2004లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే ప్రమాణం చేసే బంగారు అవకాశం అందుకున్నారు.

రాహుల్ తో బంధం :

ఇక వైఎస్సార్ రాహుల్ గాంధీ అంటే ఎంతో అభిమానం చూపించేవారు. 2004లోనే రాహుల్ గాంధీ తొలిసారి ఎంపీ అయ్యారు. అప్పటికి ఉమ్మడి ఏపీకి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక వైఎస్సార్ 2009లో రెండోసారి గెలిచిన తరువాత తరచూ ఒక మాట అంటూ ఉండేవారు. రాహుల్ గాంధీని 2014 ఎన్నికల్లో ప్రధానిని చేయాలి, ఇంతకు ఇంత మెజారిటీని సంపాదించాలని క్యాడర్ కి ఉద్భోదిస్తూండేవారు. అయితే రెండోసారి గెలిచిన తరువాత అతి తక్కువ సమయంలోనే వైఎస్సార్ మరణించారు. దాంతో ఆయన చివరి కోరిక అలాగే ఉండిపోయింది. చిత్రంగా 2014 నుంచి కేంద్రంలో బీజేపీ వరుసగా మూడు టెర్ములు అధికారంలోకి రావడంతో రాహుల్ గాంధీ వెయింటింగ్ ప్రైమ్ మినిస్టర్ గానే ఉండిపోతున్నారు.

రేవంత్ పిలుపు అదే :

ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ చివరి కోరిక రాహుల్ ని ప్రధాని చేయడం అని గుర్తు చేశారు. ఈ కోరిక తీర్చేందుకు వైఎస్సార్ అభిమానులు అనుచరులు అంతా కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రాహుల్ లాంటి బలమైన నాయకుడు దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కి అత్యుత్తమైన నివళాళి ఇవ్వాలి అంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

వైఎస్సార్ సొంత వారసులు :

ఇక వైఎస్సార్ కి రాజకీయంగా సొంత వారసులు ఉన్నారు. కుమారుడు జగన్ వేరే పార్టీ పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అలాగే కుమార్తె వైఎస్ షర్మిల అయితే కాంగ్రెస్ లోనే ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. షర్మిల తరచూ తన తండ్రి కోరిక మేరకు రాహుల్ ని ప్రధాని చేస్తామని చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఆమె కర్తవ్యం కూడా అదే ఉంటుంది. మరి జగన్ విషయం తీసుకుంటే ఆయన ఏమి చేస్తారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. వైఎస్సార్ చివరి కోరిక రాహుల్ ని ప్రధాని చేయడం అన్నది రేవంత్ రెడ్డి చెప్పారని కాదు, అందరికీ తెలిసిన విషయమే. 2029 ఎన్నికలు చూస్తే ఎన్డీయే కూటమి ఏపీలో పోటీ చేస్తుంది. అందులో బీజేపీ కూడా ఉంటుంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎదుర్కోవడం కష్టం అన్న భావన ఉంది. ఆ సమయంలో ఇండియా కూటమితో జత కట్టి ఏపీలో ఢీ కొడతారా అన్నది కూడా చర్చగా ఉంది. అలా చేస్తే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా తన తండ్రి వైఎస్సార్ చివరి కోరిక కూడా తీర్చే క్రమంలో జగన్ తన కృషి చేశారు అన్నది ఉంటుంది. మరి జగన్ అలా చేస్తార లేక తన రాజకీయ వ్యూహాలు తనవే అని ముందుకు సాగుతారా అన్నది చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu