Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ సభ్యత్వమే లేదంటూ షాకింగ్ కామెంట్స్!

వైసీపీ సభ్యత్వమే లేదంటూ షాకింగ్ కామెంట్స్!

Tupaki.com 3 days ago

ప్రముఖ రచయిత, సినీ దర్శక నిర్మాత, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ కీలక నేతగా వ్యవహరించిన పోసాని ఇప్పుడు తనకు పార్టీలో కనీస సభ్యత్వమే లేదంటూ ప్రకటించి హాట్ డిబేట్ కు తెరతీశారు.

అలా అని వైసీపీతో తెగతెంపులు చేసుకున్నట్లు ఆయన ఎక్కడా చెప్పకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. ఓ డిజిటల్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలపై పోసాని స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తన మనోగతాన్ని వెల్లడించిన పోసాని సరికొత్త చర్చకు తెరతీశారు.

వైసీపీలో తానెప్పుడు సభ్యత్వం తీసుకోలేదన్న పోసాని ప్రకటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇప్పుడు, అప్పుడు ఎప్పుడు తాను వైసీపీలో సభ్యుడిని కానని, పార్టీతో అధికారికంగా ఎటువంటి సంబంధం లేదని ఓ ఇంటర్వ్యూలో పోసాని చెప్పడం వైరల్ అవుతోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించే నాయకులకు తాను మద్దతుగా నిలుస్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మంచి నాయకుడిగా భావించి గతంలో ఆయనతో కలిసి పనిచేశానని గుర్తు చేశారు. ఇదే విధంగా జగన్ కు మద్దతు తెలిపానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తాను తరచూ కలిసేవాడినని, ఓ సినిమాకు ఆయన క్లాప్ కొట్టారని కూడా చెప్పారు.

అయితే తాను ఏ నాయకుడికీ గుడ్డిగా మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు అనిపిస్తే ప్రశ్నిస్తానని వెల్లడించారు. విధాన నిర్ణయాలు నచ్చకపోతే వ్యతిరేకిస్తానని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తనకు తెలిసిన వ్యక్తి ఆస్తిని ఓ నాయకుడు కబ్జా చేస్తే, అప్పటి ప్రభుత్వ సలహాదారు వైసీపీ నేత సజ్జల సహాకారంతో జగన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేశానని చెప్పుకొచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఎన్నడూ లేనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబును అభిమానిస్తున్నానని చెప్పడం, అదే సమయంలో తనకు వైసీపీతో సంబంధం లేదని అనడంతో పోసాని మనసు మారుతుందా? అన్న చర్చ మొదలైందని అంటున్నారు.

గత ప్రభుత్వంలో వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడిన పోసాని కూటమి ప్రభుత్వంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టు అయ్యారు. దాదాపు నెల రోజుల జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించిన పోసానిలో ఏమైనా మార్పు వచ్చిందా? అని తాజా వ్యాఖ్యల ఆధారంగా చర్చించుకుంటున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సినీ రంగంలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పోసాని కొద్దిరోజులుగా ప్రభుత్వ పెద్దల ఆగ్రహాంను చల్లార్చేలా ప్రయత్నాలు చేస్తున్నారా? అని సందేహిస్తున్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని ఒకసారి, వైసీపీతోనే ఎలాంటి బంధం లేదని మరోసారి చెప్పడం చూస్తే ఆయన రాజకీయాలకే కాకుండా వైసీపీకి దూరమయ్యే ప్రణాళికతో పనిచేస్తున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu