Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీలో అదే భయం...నిజమేనా ?

వైసీపీలో అదే భయం...నిజమేనా ?

Tupaki.com 2 weeks ago

వైసీపీకి స్థానిక ఎన్నికలు అంటే భయమా. ఎన్నికలు జరిగితే భారీ ఓటమి సంభవిస్తుందని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా. ఇదే ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఎందుకంటే కూటమి నేతలు అయితే దీని మీదనే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వైసీపీ ఎన్నికలను ఎదుర్కోలేదని కూడా అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే జిల్లాలలో జరిగే అనేక సభలలో మాట్లాడుతూ వైసీపీకి స్థానిక ఎన్నికలు అంటే భయం అని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ ఎన్నికలు పెట్టినా ఎపుడు పెట్టినా కూడా కూటమిదే ఘన విజయం అని ఆయన అంటున్నారు. అదే సమయంలో వైసీపీ చిత్తుగా ఓటమి పాలు అవుతుందని ఆయన జోస్యం చెబుతున్నారు.

కోర్టుకు వెళ్ళిన వైనం :

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్ళింది. సర్ ప్రక్రియ ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది కాబట్టి అక్టోబర్ 3న తుది జాబితా వచ్చిన తరువాత కొత్త ఓటర్ల లిస్ట్ తో ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ కోరుతోంది. ఇదే విషయం మీద కోర్టుకు వెళ్ళినట్లుగా వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం సర్‌ ద్వారా కొత్త ఓటర్ల జాబితా సవరణ చేపడుతోంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం జనవరి 1, 2026 నాటి పాత అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలకు వెళ్లడం సరైనది కాదని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాత జాబితా ప్రకారం అయితే మరణించిన నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు రోటేషన్‌ విధానం దెబ్బతింటుందని వైసీపీ వాదిస్తోంది.

అంతవరకూ ఆపాలంటూ :

సర్‌ ప్రక్రియ ముగిసి, అక్టోబర్‌లో తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిలువరించాలని వైసీపీ కోరుతోంది. అయితే వైసీపీ పిటిషన్ దాఖలు చేయడం మీద చంద్రబాబు , మంత్రి నారాయణ తదితరులు తప్పుపట్టారు. ఓటమి భయంతోనే జగన్ కోర్టుల వెనుక దాక్కుంటున్నారని ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టుల్లో కేసులు వేసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయని స్పష్టం చేస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలకు లోబడే ఎన్నికలు నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం చూస్తే వైసీపీ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంతో పాటు ఓటర్ల జాబితా సవరణ అంశం కూడా కోర్టు పరిధిలో ఉండటంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కొంత జాప్యం అయ్యే అవకాశం ఉందని కూడా ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

వైసీపీ కార్నర్ :

స్థానిక ఎన్నికల సందడి పీక్ స్టేజ్ లో ఉండగా వైసీపీ కోర్టుని ఆశ్రయించడంతో ఆ పార్టీ మీద కూటమి నేతలు విమర్శలు చేసేందుకు ఆస్కారం ఏర్పడింది అని అంటున్నారు. సర్ ప్రక్రియ ముగిసి కొత్త ఓటర్ల జాబితా అక్టోబర్ 3న వస్తే ఆ మీదట ఎన్నికలు నిర్వహించడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుందని అంటున్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వీలైతే అంతలా నిర్వహించడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే వీలు ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. దాంతో పాత ఓటర్ల జాబితాతో వెళ్దామని అనుకుంటున్నారని అంటున్నారు. మరి దీని మీద కోర్టు ఏ రకమైన తీర్పు కానీ డైరెక్షన్ కానీ ఇస్తుందో తెలియదు కానీ వైసీపీ కోర్టుని ఆశ్రయించడం ద్వారా ఎన్నికలు అంటే భయం అన్నట్లుగా విమర్శల పాలు అవుతోంది అంటున్నారు. ఒక విధంగా ఈ ప్రచారం జనంలోకి వెళ్లడం వైసీపీ చేస్తున్న వాదనలు పెద్దగా ఫోకస్ కాకపోవడంతో వైసీపీకి భయమన్నదే ప్రచారంగా సాగుతోంది. ఇది వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిని కలిగించేదే అని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu