Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయసాయిరెడ్డి సంచలన లేఖ.. సజ్జలపై తీవ్ర విమర్శలు.. జగన్ పై సన్నాయి నొక్కులు!!

విజయసాయిరెడ్డి సంచలన లేఖ.. సజ్జలపై తీవ్ర విమర్శలు.. జగన్ పై సన్నాయి నొక్కులు!!

Tupaki.com 1 week ago

వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తనపై వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆ పార్టీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాలు వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాసిన ఈ లేఖలో అనేక ఆరోపణలు చేశారు. తాను మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి నమ్మకద్రోహం చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కొత్త పార్టీ పెడుతున్నాననే కారణంతో సజ్జల ప్రోద్బలంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..

వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల మనసు మార్చుకున్నారు. త్వరలో తాను కొత్త పార్టీ పెడతానంటూ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని విజయసాయిరెడ్డి లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై సజ్జల ఆధ్వర్యంలో భౌతికదాడి జరిగినా మాజీ సీఎం జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీలో ఉండగా, తనపై 74 సార్లు దాడి జరిగిందని విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

అప్రూవర్ గా మారేవాడని..!

వైయస్సార్‌సీపీ 'కోటరీ' నా మీద 'సమ్మక ద్రోహి' అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం పెట్టిస్తున్నందున బహిరంగ లేఖ రాసినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నమ్మకద్రోహిని అయితే ఆ నాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో పేరు లేకుండా చేసుకునేవాడిని లేఖలో పేర్కొన్నారు. జగన్‌కి నమ్మకస్తుడిని అనే ఒకే ఒక్క కారణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎ-2గా కేసులు ఎదుర్కొన్నానని, 15 నెలలు జైల్లో ఉన్నానని గుర్తు చేశారు. తాను నమ్మక ద్రోహం చేస్తే అప్పుడే అప్రావర్‌గా మారేవాడిని స్పష్టం చేశారు.

ఇక కూటమి ప్రభుత్వంలో తాను కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల తర్వాత సంబంధం లేకపోయినా లిక్కర్ స్కామ్‌లో ఎ-5గా చేర్చారని తెలిపారు. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో ఎ-2 గా కేసు నమోదు చేశారని వెల్లడించారు. కానీ, ఈ రెండున్నర ఏళ్ల టీడీపీ పాలనలో "సకల శాఖల మంత్రి" పేరు మాత్రం ఇంతవరకు ఏ చార్జిషీట్లోనూ లేదంటూ సజ్జలపై విమర్శలు గుప్పించారు. జగన్‌కి వెన్నుపోటు పొడుస్తూ, ఆయనకు తెలియకుండా టీడీపీతో కలిసి ఎలా పని చేయాలో, కేసులు లేకుండా ఎలా చూసుకోవాలో "కోటరీ నాయకుడు"కి తెలిసినంత తనకు తెలిదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక పార్టీ మారడానికి రెడీగా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడితో కలిసి కోటరీ నాయకుడు 2020లో జగన్‌ నుంచి తనను దూరం చేశారని మండిపడ్డారు. 40 ఏళ్లు అత్యంత నమ్మకస్తుడిగా పని చేసిన తాను ఆత్మగౌరవం చంపుకోలేనని స్పష్టం చేశారు. 2020 నుంచి తనను అన్నివిధాలా దూరం చేశారని ఆరోపించారు. ''పార్టీ కి నా సేవలు ఏంటి, సజ్జల ద్రోహం ఏంటి, పరిపాలన జగన్ చేశారా, "సజ్జల" సకల శాఖ మంత్రి గా, ఒక రాజ్యాంగేతర శక్తి గా తన ముఠా తో చేసిన పాలన'' అంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సహితం అపాయింట్‌మెంట్‌ లేకుండా గోడ కట్టింది సజ్జల కాదా? అంటూ ప్రశ్నలు సంధించారు.

పార్టీలో నెంబరు టుగా పనిచేసిన తాను సజ్జల కింద పనిచేయలేక పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా ఏమీ మాట్లాడలేదని, కోటరీ కారణంగా జరిగిన అవమానాలతోనే బయటకు వచ్చానని వివరించారు. అయినా, కోటరీ వారంతా తనను విమర్శిస్తున్నారని, తాను ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తానని వెల్లడించారు. జగన్‌ ను మోసం చేస్తూ కోవర్ట్ రాజకీయం చేయడం చేత కాదని తేల్చిచెప్పారు. 2022లో జరిగిన పార్టీ ప్లీనరీలో సకల శాఖ మంత్రి నా మీద డెరెక్టుగా, భౌతికంగా దాడి చేస్తే జగన్‌కి తెలిసి ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు. ఇలాంటి అవమానాలు మొత్తం 74 ఉన్నాయని లెక్క చెప్పారు. మొత్తం రెండు పేజీల సుదీర్ఘ లేఖలో సజ్జలపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిచోట తాను జగన్మోహనరెడ్డికి నమ్మకద్రోహం చేయడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక విజయసాయిరెడ్డి రాసిన ఈ బహిరంగ లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu