సెలబ్రిటీల ప్రపంచంలో ఫ్యాషన్, గ్లామర్ అనేవి కేవలం అలంకారానికి సంబంధించినవి మాత్రమే కావు. అవొక పెద్ద వ్యాపార సామ్రాజ్యం .. ప్రతిష్టకు సంబంధించిన అంశాలు.
అంతర్జాతీయ వేడుకలు ..విదేశీ పర్యటనల సమయంలో బాలీవుడ్ ప్రముఖులు ధరించే దుస్తులు ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ అత్యంత ఖరీదైన జీవనశైలి వెనుక ఉండే రక్షణ నిర్వహణ లోపాలు కొన్నిసార్లు ఊహించని నష్టాలకు, వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్ స్టైలిస్ట్ - నిర్మాత బృందానికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సోదరి రేహా కపూర్ బృందంలో జరిగిన ఓ భారీ చోరీ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. న్యూయార్క్ పర్యటన కోసం ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న 1.35 కోట్ల రూపాయల విలువైన డైమండ్ ఈరింగ్స్ అకస్మాత్తుగా మాయమవ్వడం కలకలం రేపింది. ఈ ఖరీదైన ఆభరణాలను మేకప్ ఆర్టిస్ట్ బ్యాగ్‌లో ఉంచినట్లు.. అక్కడి నుంచే ఇవి చోరీకి గురైనట్లు సమాచారం. ఈ మేరకు సదరు బృందం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా అంతర్జాతీయ ఈవెంట్స్ ..రెడ్ కార్పెట్ ప్రదర్శనల కోసం సెలబ్రిటీలు ధరించే కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ల నుండి ఒక రోజు కోసం అద్దెకు తీసుకోవడం చిత్ర పరిశ్రమలో కనిపిస్తుంది. అలాంటి అపురూపమైన వజ్రాల ఆభరణాలను రక్షించడం, పర్యటన ముగిసిన తర్వాత తిరిగి భద్రంగా అప్పగించడం అనేది సదరు సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ .. స్టైలింగ్ టీమ్ బాధ్యత. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం జరిగితే భారీ ఆర్థిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ ఘటన నిరూపించింది.
ఈ తరహా దొంగతనాలు సెలబ్రిటీల పర్యటనల సమయంలో ఉండే రక్షణ వలయం ..లాజిస్టిక్స్ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. విదేశీ ప్రయాణాలలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు , అసిస్టెంట్లు భారీ లగేజీతో నిరంతరం ప్రయాణించాల్సి ఉంటుంది. అత్యంత ఖరీదైన వస్తువులను ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలో లేదా ప్రత్యేక లాకర్లలో ఉంచకుండా సాధారణ సిబ్బంది బ్యాగులలో ఉంచడం అనేది నేరస్థులకు సులభమైన అవకాశంగా మారే ప్రమాదం ఉంది. ప్రయాణాల హడావిడిలో సిబ్బందిపై ఉండే ఒత్తిడిని దొంగలు ఆసరాగా చేసుకుంటారని మరోసారి స్పష్టమైంది.
ఇలాంటి సంఘటనలు ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాకుండా.. సెలబ్రిటీ బృందాల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తాయి. కోట్లాది రూపాయల వస్తువులను నమ్మి అప్పగించే పెద్ద పెద్ద డిజైనర్ బ్రాండ్లు, భవిష్యత్తులో నటీనటులకు ఇవ్వడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుంది. భద్రతా ప్రోటోకాల్స్‌ను పక్కాగా అమలు చేయకపోవడం వల్ల ఇటు బ్రాండ్ ఆభరణం చేజారడంతో పాటు అటు సెలబ్రిటీల ప్రతిష్టకు .. వారి సిబ్బంది నమ్మకానికి గండి పడుతుంది.

