Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖ తూర్పులో టీడీపీ మార్క్ మార్పు ?

విశాఖ తూర్పులో టీడీపీ మార్క్ మార్పు ?

Tupaki.com 5 days ago

విశాఖ తూర్పు నియోజకవర్గం 2009లో ఏర్పాటు అయిన దగ్గర నుంచి వరసబెట్టి టీడీపీ గెలుస్తూ వస్తోంది. ఇప్పటికి నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే అన్ని సార్లూ టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు.

ఆయన ఈసారితో ఏకంగా 20 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పాలించిన నేతగా రికార్డు క్రియేట్ చేస్తున్నారు. విశాఖ జిల్లా ఏర్పడిన తరువాత స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళ పాటు ఎన్నికలు జరిగాక వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతి కొద్ది మంది నేతలలో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. అయితే ఆయనకు సామాజిక సమీకరణల కారణంగా మంత్రి పదవి అయితే దక్కలేదు. మరో వైపు చూస్తే ఆయన తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంచారు.

ఓపిక తగ్గిందా :

ఇదిలా ఉంటే ఈ మధ్య జరిగిన జిల్లా పార్టీ ఎమ్మెల్యేల సమీక్షా సమావేశంలో అధినేత చంద్రబాబు తూర్పు నియోజకవర్గాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అవి ఇపుడు పార్టీలోనూ రాజకీయంగానూ చర్చగా ఉన్నాయని అంటున్నారు. వెలగపూడికి ఓపిక తగ్గింది అంటూ అధినాయకత్వం కామెంట్స్ చేసింది అని ప్రచారం సాగుతోంది. దాంతో పాటుగా తూర్పులో బలంగా ఉన్న సామాజిక వర్గం యాదవులను కూడా కలుపుకుని పోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దాంతో తూర్పు మీద హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టిందని అర్ధం అవుతోంది అని అంటున్నారు.

ఆయనకు చోటు :

ఈ మధ్య టీడీపీ రాష్ట్ర జాతీయ కమిటీల నియామకంలో తూర్పు నియోజకవర్గం నుంచి వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కి కీలక పదవి దక్కింది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత వెలగపూడికి అయితే ఏ పదవీ ఇవ్వలేదు. ఆయన వారసుడు కుమారుడు అయిన యువ నేతకు కూడా స్థానం కల్పించలేదు. దాంతో తూర్పు లో మార్పు ఖాయమా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక ప్రణవ్ గోపాల్ అయితే మంత్రి నారా లోకేష్ టీం లో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన వీఎంఆర్డీఏ చైర్మన్ పదవిని కట్టబెట్టడమే కాకుండా మరోసారి కూడా పొడిగించి కొనసాగిస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఇపుడు పార్టీలో కూడా కీలకం చేస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో తూర్పు అసెంబ్లీ నుంచి ఆయనని పోటీ చేయిస్తారా అన్న చర్చ సాగుతోంది.

బీసీల పట్టు :

మరో వైపు తూర్పులో అత్యధిక శాతం బీసీలు ఉన్నారు. వారంతా తమకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరుతున్నారు. యాదవ సామాజిక వర్గం అయితే గాజువాకతో పాటు తూర్పు కూడా ఇవ్వాలని అపుడే సమ న్యాయం అవుతుందని వాదిస్తోంది. దాంతోనే యాదవులను కూడా కలుపుకుని పోవాలని హైకమాండ్ సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే యాదవుల నుంచి కూడా సమర్ధులైన నాయకులు టీడీపీకి ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే 2029 లో సీట్లు కనుక పెరగకపోతే మాత్రం టీడీపీలో భారీ మార్పు ఉంటుందని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి హవా సాగుతున్నప్పటికీ పార్టీదే అంతిమ నిర్ణయం కాబట్టి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu