Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూఏఈలో హై అలర్ట్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడితో కలకలం

యూఏఈలో హై అలర్ట్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడితో కలకలం

Tupaki.com 1 week ago

యూఏఈలోని ప్రముఖ అణు విద్యుత్ కేంద్రం బరకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్‌పై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. అల్-ధఫ్రా ప్రాంతంలో ఉన్న ఈ అణు కేంద్రంలోని విద్యుత్ జనరేటర్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని డ్రోన్ దాడి జరిపినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రోన్ ఢీకొనడంతో జనరేటర్ వద్ద మంటలు చెలరేగగా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగ్నిమాపక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అధికారుల ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా అణు కేంద్రంలో రేడియోలాజికల్ సేఫ్టీ లెవెల్స్ పూర్తిగా నియంత్రణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. రేడియేషన్ లీకేజీ లేదా అణు ప్రమాదం జరగలేదని వెల్లడించడంతో స్థానిక ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. అయినప్పటికీ ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాలు, దాడి చేసిన వారు ఎవరు అన్న అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

బరకా న్యూక్లియర్ ప్లాంట్ యూఏఈ విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించారు. దేశ విద్యుత్ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని ఈ ప్లాంట్ ద్వారా సరఫరా చేస్తున్నారు. అలాంటి కీలక స్థావరంపై డ్రోన్ దాడి జరగడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యత పెరిగింది.

దాడి అనంతరం యూఏఈ భద్రతా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి. ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా మరింత పెంచడంతో పాటు గగనతల భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద డ్రోన్ల కదలికలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇరాన్ దాడి చేసిందా? దాడికి ఉపయోగించిన సాంకేతికత ఏమిటి? అనే అంశాలను విశ్లేషిస్తున్నారు.

ఇక అంతర్జాతీయ అణుశక్తి సంస్థలు కూడా ఈ ఘటనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అణు కేంద్రాల భద్రత విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. యుద్ధాలు, ఉగ్రవాద చర్యలు, డ్రోన్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అణు కేంద్రాల రక్షణ మరింత కీలకమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన భవిష్యత్తులో అణు కేంద్రాల భద్రతా విధానాల్లో మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu