Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AMARAVATHI: అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం

AMARAVATHI: అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం

TV5 News 1 week ago

By - Sathwik |15 May 2026 12:15 PM IST

వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్న కూటమి సర్కార్

రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధానిని తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల గ్రామం సమీపంలో సుమారు 4,618 ఎకరాల భూమిని విమానాశ్రయ నిర్మాణానికి అనువైన ప్రాంతంగా గుర్తించారు. రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండటంతో పాటు గుంటూరు, విజయవాడ నగరాలకు సులభ అనుసంధానం కలిగే విధంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉండే ఈ ప్రదేశం ప్రస్తుత సచివాలయం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నిర్మాణంలో మరో ముఖ్య అంశం గ్రామాల పునరావాస సమస్య తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం. హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం నాలుగు గ్రామాలను తరలించాల్సి వచ్చిన నేపథ్యంలో, అమరావతిలో అలాంటి పరిస్థితి లేకుండా గ్రామాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో స్థల ఎంపిక చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక్క గ్రామాన్నీ తరలించాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం గుర్తించిన భూములు రాజధాని రెండో దశ భూసమీకరణ పరిధిలో లేవని అధికారులు చెబుతున్నారు. భూసమీకరణ ద్వారా తీసుకోవాలా లేదా భూసేకరణకు వెళ్లాలా అన్న అంశంపై రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతిపాదనకు ఇప్పటికే భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ పూర్తి చేసి సానుకూల సంకేతాలు ఇచ్చింది. అలాగే రైట్స్‌ కన్సల్టెన్సీ సంస్థ టెక్నో-ఎకనమిక్‌ ఫీజిబిలిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికల ఆధారంగా ప్రాజెక్టు అమలు దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారీ బోయింగ్‌ 777 విమానాలు కూడా దిగేలా విమానాశ్రయాన్ని డిజైన్‌ చేయడం విశేషం. తొలి దశలోనే సుమారు రూ.3,409 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వచ్చే 60 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఐదు దశల్లో విమానాశ్రయాన్ని విస్తరించేలా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. 2028 నుంచి 2030 మధ్య నిర్మాణం పూర్తయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రారంభమైన తర్వాత తొలి పదేళ్లలోనే సంవత్సరానికి 63.5 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించే అవకాశముందని అంచనా వేసి, అందుకు అనుగుణంగా తొలి దశ రూపకల్పన చేశారు.

మొదటి దశలో సుమారు 2,648 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం చేపడతారు. 4 వేల మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఆధునిక రన్‌వే నిర్మించనున్నారు. కేవలం విమానాశ్రయానికే పరిమితం కాకుండా విమానాల మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) సదుపాయాలతో సమీకృత వైమానిక హబ్‌గా దీనిని అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. అంతేకాకుండా హోటళ్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య ప్రాజెక్టులతో ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. మొత్తం భూభాగంలో 3,823 ఎకరాల్లో విమానాశ్రయం మరియు సంబంధిత సదుపాయాలు ఏర్పాటు చేయగా, 795 ఎకరాలను వాణిజ్య అవసరాలకు కేటాయించనున్నారు. అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి అదనంగా 200 ఎకరాలు అవసరమని గుర్తించారు. రవాణా అనుసంధాన పరంగా కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. విస్తరణకు సిద్ధమవుతున్న అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి విమానాశ్రయం సమీపం గుండా వెళ్లి కోల్‌కతా-చెన్నై హైవేతో కలవనుంది. అలాగే గన్నవరం విమానాశ్రయం నుంచి 60 కిలోమీటర్లు, గుంటూరు రైల్వే స్టేషన్‌ నుంచి 21 కిలోమీటర్లు, విజయవాడ బస్టాండ్‌ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయం ఉండనుంది. దీంతో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు కీలక రవాణా, వాణిజ్య కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధానిని తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల గ్రామం సమీపంలో సుమారు 4,618 ఎకరాల భూమిని విమానాశ్రయ నిర్మాణానికి అనువైన ప్రాంతంగా గుర్తించారు. రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండటంతో పాటు గుంటూరు, విజయవాడ నగరాలకు సులభ అనుసంధానం కలిగే విధంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉండే ఈ ప్రదేశం ప్రస్తుత సచివాలయం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నిర్మాణంలో మరో ముఖ్య అంశం గ్రామాల పునరావాస సమస్య తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం. హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం నాలుగు గ్రామాలను తరలించాల్సి వచ్చిన నేపథ్యంలో, అమరావతిలో అలాంటి పరిస్థితి లేకుండా గ్రామాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో స్థల ఎంపిక చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక్క గ్రామాన్నీ తరలించాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం గుర్తించిన భూములు రాజధాని రెండో దశ భూసమీకరణ పరిధిలో లేవని అధికారులు చెబుతున్నారు. భూసమీకరణ ద్వారా తీసుకోవాలా లేదా భూసేకరణకు వెళ్లాలా అన్న అంశంపై రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu