Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌

AP: ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌

TV5 News 1 week ago

By - Sathwik |16 May 2026 4:15 PM IST

భోగాపురంలో 855 ఎకరాల కేటాయింపు.. రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్..రిలయన్స్ 1.08 లక్షల కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక మరియు సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. ముఖ్యంగా విశాఖ ప్రాంతాన్ని సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే గ్లోబల్ స్థాయి సంస్థలు రాష్ట్రంపై ఆసక్తి చూపుతుండగా, ఇప్పుడు మరో భారీ సంస్థ తన ప్రాజెక్టుతో ముందుకు రావడం రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన తర్వాత ఇప్పుడు మరో భారీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదపడే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో భారీ స్థాయి డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి కేటాయింపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాలోని భోగాపురం ప్రాంతాన్ని భవిష్యత్తులో సాంకేతిక, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ఈ ప్రాంతంలో రిలయన్స్ డేటా సెంటర్ నిర్మాణం జరగనుండటం మరింత ప్రాధాన్యతను తీసుకురానుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 855 ఎకరాల భూమిని కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. భోగాపురం ఈస్ట్‌, భోగాపురం వెస్ట్‌, పోలిపల్లి గ్రామాల పరిధిలో ఈ భూమి విస్తరించి ఉంది.

అనువైన ప్రదేశం ఎంపిక

ఈ ప్రాంతానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ సంస్థ కూడా దీనిని అనువైన ప్రదేశంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటంతో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు కూడా దగ్గరగా ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అధునాతన కనెక్టివిటీ, వేగవంతమైన డేటా బదిలీ వ్యవస్థలు కీలకమైన నేపథ్యంలో ఈ ప్రాంతం అత్యంత అనుకూలంగా మారినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రానున్నాయి. రిలయన్స్ సంస్థ సుమారు రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడిని ఈ ప్రాజెక్టులో పెట్టనున్నట్లు సమాచారం. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రతిపాదితమైన పెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ పెట్టుబడులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం సంస్థకు కొన్ని రాయితీలను కూడా కల్పించనుంది. నిబంధనల ప్రకారం భూమి విలువలో 25 శాతం వరకు రాయితీ ఇవ్వడంతో పాటు ఇతర పెట్టుబడి ప్రోత్సాహకాలను కూడా అందించనుంది. దీని ద్వారా మరిన్ని సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇక రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక పరమైన అవకాశాలు పెంచే దిశగా కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల నమోదిత ఎంఎస్‌ఎంఈల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎంఈ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ వేదిక ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈక్విటీ మూలధనం సమకూర్చుకోవడంతో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు అవసరమైన విధివిధానాలు, అనుమతులు మరియు అమలు ప్రక్రియను రూపొందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి కొత్త మార్గాలను తెరవనుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్త పరిశ్రమల స్థాపన, ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కేబినెట్ ఆమోదించింది. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతి లభించింది. అలాగే ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్న అపోలో టైర్స్ తయారీ యూనిట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో వేస్ట్ హీట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్‌కు అనుమతులు మంజూరు చేశారు. అదేవిధంగా గ్రిడాన్ ఎనర్జీ ఆధ్వర్యంలో సోలార్ సెల్ తయారీ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. డాలస్ టెక్నాలజీ సెంటర్ విస్తరణకు అవసరమైన అదనపు భూమి కేటాయింపునకు కూడా కేబినెట్ అనుమతి తెలిపింది.

ఇవే కాకుండా అమరావతిలో అభివృద్ధి చేస్తున్న క్వాంటం వ్యాలీలో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీకి చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాన్ని సాంకేతిక, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భవిష్యత్తులో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణకు మరింత బలాన్ని అందిస్తాయని భావిస్తున్నారు.

అనువైన ప్రదేశం ఎంపిక

అనువైన ప్రదేశం ఎంపిక

అనువైన ప్రదేశం ఎంపిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu