By - Sathwik |19 May 2026 3:45 PM IST
నెల్లూరు జిల్లాలో మత్య్సకారుల సేవ ప్రారంభం.. కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల ఆర్థికసాయం
సముద్రాన్ని ఆధారంగా చేసుకుని జీవనం సాగించే వేలాది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, వారి హక్కుల పరిరక్షణ విషయంలో కూడా ప్రభుత్వం వెనుకడుగు వేయదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర తీరప్రాంతాల్లో ఇతర ప్రాంతాల మత్స్యకారుల అక్రమ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరిస్తూనే, మత్స్యకారుల సంక్షేమం, ఆదాయ వృద్ధి, భవిష్యత్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన 'మత్స్యకారుల సేవ' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఇచ్చే సాయంలో పెరుగుదల లేకపోయిందని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 వేలుగా ఉన్న సాయాన్ని రూ.20 వేలకు పెంచినట్లు చెప్పారు.
రాష్ట్ర మత్స్యకారుల జీవనోపాధి, వారి హక్కుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో చేపల వేట హక్కు ప్రధానంగా రాష్ట్ర మత్స్యకారులకేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన బోట్లతోనే వేట సాగాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బోట్లను సహించబోమని హెచ్చరించారు. ఒకవేళ ఇతర రాష్ట్రాలకు చెందిన బోట్ల చొరబాటు జరిగితే శాటిలైట్ సాంకేతికత ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవుతామని తెలిపారు. బోటు ప్రవేశించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరుతుందని, ఆ వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3256 కోట్ల వ్యయంతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, దాని గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. హార్బర్ నిర్మాణం పూర్తయ్యాక మత్స్యకారులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. మత్స్య సంపద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగాల తర్వాత ఎక్కువ మంది ఉపాధి కోసం మత్స్య రంగంపైనే ఆధారపడుతున్నారని చెప్పారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలలో సుమారు 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. అలాగే సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ ద్వారా మహిళలకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని సూచించారు. పురుషులు చేపల వేటకు వెళ్తే మహిళలు సీవీడ్ సాగుపై దృష్టి పెట్టాలని, తద్వారా కుటుంబాల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. చేపలు మంచి ప్రోటీన్ ఆహారమని, ప్రజలు వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. మత్స్యకారులు ఉత్పత్తి చేసే చేపల విక్రయానికి తానే మార్కెటింగ్ మేనేజర్‌లా పనిచేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. వేట నిషేధ కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సాయం తమ కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోందని తెలిపారు. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ పలుచోట్ల మత్స్యకారులు బోట్లతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యంగా కృష్ణా నదిలో నిర్వహించిన భారీ బోట్ల ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా ఈ పథకాన్ని కొనసాగించడం పట్ల మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

