By - Sathwik |18 May 2026 11:00 AM IST
పొగాకు రైతులను ఆదుకోవాలని వినతి
రాష్ట్రంలో పొగాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది రైతుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ దృష్టికి కీలక అంశాలను తీసుకెళ్లారు.
ముఖ్యంగా ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు సాగుదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లు, మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత కేంద్ర మంత్రులకు సీఎం లేఖలు రాసి సమస్య తీవ్రతను వివరించారు. ఇటీవలి కాలంలో సిగరెట్ ఉత్పత్తులపై అమలులోకి వచ్చిన పన్నుల విధానాల్లో మార్పులు, జీఎస్టీతో పాటు ఎక్సైజ్ డ్యూటీల పెంపు ప్రభావం పొగాకు రంగంపై తీవ్రంగా పడుతున్నట్లు ముఖ్యమంత్రి లేఖలో వివరించారు. పెరిగిన పన్నుల భారం నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపడంతో మార్కెట్‌లో డిమాండ్ తగ్గుముఖం పట్టిందని, దాని ప్రభావం చివరికి రైతుల ఆదాయంపై పడుతోందని ఆయన పేర్కొన్నారు.
గతంలో పొగాకు ధరలు రైతులకు కొంత ఊరటనిచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చంద్రబాబు కేంద్రానికి వివరించారు. గత ఏడాది కిలోకు సుమారు రూ.280 వరకు లభించిన ధర ప్రస్తుతం రూ.250కు పడిపోవడం రైతుల్లో ఆందోళన పెంచిందన్నారు. ధరల్లో ఈ తగ్గుదల రైతుల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కొనుగోలు సంస్థలు కూడా తమ అవసరాలను తగ్గించుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మార్కెట్‌లో వినియోగం తగ్గడం వల్ల కంపెనీలు గతంతో పోలిస్తే తక్కువ పరిమాణంలో కొనుగోళ్లు చేస్తున్నాయని, దీని ప్రభావం నేరుగా రైతుల ఉత్పత్తులపై పడుతోందని పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్లో చోటుచేసుకున్న మార్పులు కూడా ఎగుమతిదారులకు సవాళ్లు సృష్టిస్తున్నాయని ఆయన వివరించారు.
ఈ పరిస్థితులు కేవలం రైతులకే పరిమితం కావడం లేదని, పొగాకు సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి రంగాలపై ఆధారపడిన అనేక కుటుంబాల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43 వేల మంది పొగాకు రైతులు ఈ రంగంపై ఆధారపడి ఉండగా, వారితో పాటు లక్షలాది మంది కార్మికులు కూడా తమ ఉపాధిని దీనిపైనే కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. మార్కెట్‌లో స్థిరత్వం నెలకొల్పాలంటే పన్నుల విధానంలో తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పెరిగిన పన్నుల ప్రభావాన్ని కేంద్రం సమీక్షించాలని, పరిస్థితులను పరిశీలించి రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని కోరారు. పొగాకు రంగాన్ని కాపాడడంతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పొగాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది రైతుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ దృష్టికి కీలక అంశాలను తీసుకెళ్లారు. ముఖ్యంగా ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు సాగుదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లు, మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత కేంద్ర మంత్రులకు సీఎం లేఖలు రాసి సమస్య తీవ్రతను వివరించారు. ఇటీవలి కాలంలో సిగరెట్ ఉత్పత్తులపై అమలులోకి వచ్చిన పన్నుల విధానాల్లో మార్పులు, జీఎస్టీతో పాటు ఎక్సైజ్ డ్యూటీల పెంపు ప్రభావం పొగాకు రంగంపై తీవ్రంగా పడుతున్నట్లు ముఖ్యమంత్రి లేఖలో వివరించారు. పెరిగిన పన్నుల భారం నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపడంతో మార్కెట్‌లో డిమాండ్ తగ్గుముఖం పట్టిందని, దాని ప్రభావం చివరికి రైతుల ఆదాయంపై పడుతోందని ఆయన పేర్కొన్నారు.

