By - Sathwik |15 May 2026 11:15 AM IST
కాటన్ జయంతి సందర్బంగా స్మరించుకున్న చంద్రబాబు
గోదావరి తీర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్‌ను ఆయన జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్మరించుకున్నారు.
సాగునీటి రంగంలో ఆయన చేసిన సేవలను రాజకీయ నాయకులు, రైతు సంఘాలు, ప్రజలు కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు.
మహానీయుడు అన్న చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాటన్ దొరను ఆధునిక సాగునీటి ప్రాజెక్టులకు మార్గదర్శిగా అభివర్ణిస్తూ నివాళులర్పించగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గోదావరి నదీ జలాలు సముద్రంలో కలిసిపోతుండగా రైతులు కరవుతో అల్లాడిన రోజుల్లో, డెల్టా ప్రాంత భవితవ్యాన్ని మార్చిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తన దూరదృష్టితో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టి లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చేశారని గుర్తుచేశారు. గోదావరి డెల్టా సస్యశ్యామలం కావడానికి ఆయన కృషే ప్రధాన కారణమని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి వనరుల సమర్థ వినియోగానికి కాటన్ దొరే స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. రైతు కుటుంబాలకు శాశ్వత సంపదను అందించిన మహనీయుడిగా ఆయనను తరతరాలు గుర్తుంచుకుంటాయని చంద్రబాబు అన్నారు.
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా సర్ ఆర్థర్ కాటన్‌కు నివాళులర్పించారు. గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయంటే అందుకు కారణం కాటన్ దొరేనని పేర్కొన్నారు. వరద జలాలను సమర్థంగా వినియోగించేందుకు ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించిన మహనీయుడిగా కొనియాడారు. వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ పేరు గోదావరి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అప్పట్లో కరవుతో ఇబ్బందులు పడుతున్న డెల్టా ప్రజల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, ఆనకట్ట నిర్మాణం ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమని భావించారు. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి అనుకూల పరిస్థితులను గుర్తించి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. 1847లో ప్రారంభమైన నిర్మాణ పనులు అనేక కష్టనష్టాల మధ్య 1852 నాటికి పూర్తయ్యాయి. వేలాది మంది శ్రామికుల కృషి, విదేశీ యంత్రాల వినియోగంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గోదావరి డెల్టా రూపురేఖలను మార్చేసింది. ప్రధాన కాలువలు, పిల్లకాలువల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా తీరప్రాంతాల వరకూ సాగునీరు చేరేలా చేసిన కాటన్ దొర దూరదృష్టి వల్లే ఉభయగోదావరి జిల్లాలు అన్నపూర్ణగా మారాయి. నేటికీ నీటి ఎద్దడి సమయంలో కూడా ఆ కాలువల వ్యవస్థ రైతులకు అండగా నిలుస్తోంది. అందుకే గోదావరి జిల్లాల్లో కాటన్ దొరను ప్రజలు దేవుడిలా భావిస్తారు. రైతులు ఆయన విగ్రహాలకు ధాన్యాభిషేకాలు చేయడం, జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకోవడం అక్కడి ప్రజల కృతజ్ఞతకు నిదర్శనంగా నిలుస్తోంది.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియంలో కాటన్ దొర వినియోగించిన పరికరాలు, ఇంజనీరింగ్ మ్యాప్‌లు, ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు తదితర చారిత్రక విశేషాలను ప్రభుత్వం భద్రపరిచింది. దీంతో కొత్తతరం కూడా ఆయన సేవలను తెలుసుకునే అవకాశం కలుగుతోంది. గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసి రైతాంగానికి జీవనాధారం అందించిన సర్ ఆర్థర్ కాటన్ సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని పలువురు అభిప్రాయపడ్డారు.
గోదావరి తీర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్‌ను ఆయన జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్మరించుకున్నారు. సాగునీటి రంగంలో ఆయన చేసిన సేవలను రాజకీయ నాయకులు, రైతు సంఘాలు, ప్రజలు కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు.
మహానీయుడు అన్న చంద్రబాబు
మహానీయుడు అన్న చంద్రబాబు
మహానీయుడు అన్న చంద్రబాబు

