By - Sathwik |23 May 2026 8:00 AM IST
విజయం సాధించినా సన్‌రైజర్స్‌కు నిరాశే.. క్వాలిఫయిర్-1కు అర్హత సాధించిన ఆర్సీబీ... కొండంత స్కోరు చేసిన హైదరాబాద్
ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో పరుగుల వర్షం కురిసింది. భారీ స్కోర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించినా, ఆ విజయంతో ఆశించిన పూర్తి ఫలితం మాత్రం దక్కలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆధిపత్యం ప్రదర్శించి భారీ తేడాతో గెలిచినప్పటికీ, పాయింట్ల పట్టికలో కీలకమైన రెండో స్థానాన్ని అందుకోవడంలో హైదరాబాద్ జట్టు వెనుకబడింది. దీంతో ప్లేఆఫ్స్‌లో నేరుగా క్వాలిఫయర్-1కు వెళ్లే అవకాశం చేజారగా, ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీగ్ దశ ముగిసే సమయానికి బెంగళూరు, గుజరాత్, సన్‌రైజర్స్ జట్లు తలో 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా బెంగళూరు అగ్రస్థానాన్ని కాపాడుకుంది. గుజరాత్ రెండో స్థానంలో నిలవగా, సన్‌రైజర్స్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో బెంగళూరు, గుజరాత్ జట్లు క్వాలిఫయర్-1లో తలపడనుండగా, సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తోంది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఎటువంటి సందేహం లేకుండా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఆ నిర్ణయాన్ని జట్టు బ్యాటర్లు సమర్థిస్తూ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి ప్రారంభించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ వేగంగా పరుగులు రాబట్టడంతో స్కోరు దూసుకెళ్లింది. హెడ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా, అభిషేక్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. వరుసగా బౌండరీలు, సిక్సర్లతో బెంగళూరు బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన అతడు ప్రత్యర్థి శిబిరంలో ఆందోళన రేపాడు. అభిషేక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ మరింత దూకుడు ప్రదర్శించాడు. మొదట కాస్త నెమ్మదిగా కనిపించిన క్లాసెన్ కూడా ఆ తర్వాత తన సహజ శైలిలో చెలరేగిపోయాడు. ముఖ్యంగా హేజిల్‌వుడ్ వేసిన ఓవర్లో వరుస భారీ షాట్లతో మ్యాచ్ వేగాన్ని ఒక్కసారిగా పెంచేశాడు. మూడో వికెట్‌కు ఇషాన్, క్లాసెన్ కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ వేగంగా అర్ధశతకాలు పూర్తి చేసి జట్టును భారీ స్కోరు వైపు నడిపించారు. చివర్లో నితీశ్‌కుమార్ రెడ్డి కూడా మెరుపులు మెరిపించాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే తొలి బంతుల నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీలు, సిక్సర్లతో స్కోరును మరింత పెంచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ సీజన్లో జట్టు సాధించిన అత్యుత్తమ స్కోర్లలో ఇది ఒకటిగా నిలిచింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు మొదట దూకుడుగా కనిపించింది. వెంకటేశ్ అయ్యర్ వేగంగా పరుగులు సాధిస్తూ హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలి కొన్ని ఓవర్లలోనే అతని దూకుడు కారణంగా బెంగళూరు స్కోరు వేగంగా కదిలింది. అయితే వరుసగా కీలక వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు కాస్త వెనుకబడింది. విరాట్ కోహ్లి కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే మ్యాచ్ గెలవడం కంటే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బెంగళూరు వ్యూహం మార్చుకుంది. పాటీదార్, కృనాల్ జాగ్రత్తగా ఆడుతూ అవసరమైన పరుగులపై దృష్టి పెట్టారు. పెద్ద షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్, బౌండరీలతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశారు. తమకు అవసరమైన రన్‌రేట్‌ను అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సురక్షితం చేసుకున్నారు. మ్యాచ్‌లో మాత్రం 55 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు.

