By - jyotsna |15 May 2026 6:45 AM IST
టెక్స్‌టైల్ రంగంపై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని వినతి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి కీలక లేఖ రాశారు.
దేశంలోని టెక్స్‌టైల్ రంగాన్ని, ముఖ్యంగా లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు పత్తిపై ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. పత్తి, నూలు ధరలు భారీగా పెరగడంతో టెక్స్‌టైల్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్, అపారెల్ ఎగుమతి రాష్ట్రం తమిళనాడేనని విజయ్ లేఖలో పేర్కొన్నారు. ఈ రంగంపై లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఇది ప్రధాన ఉపాధి వనరని తెలిపారు. అయితే ఇటీవల దేశంలో పత్తి ఉత్పత్తి తగ్గడం, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరిగాయని వివరించారు.
గత రెండు నెలల్లో పత్తి ధరలు 25 శాతం పెరిగినట్లు సీఎం వెల్లడించారు. ఒక క్యాండీ పత్తి ధర రూ.54,700 నుంచి రూ.67,700కు చేరిందని తెలిపారు. అలాగే నూలు ధర కిలోకు రూ.301 నుంచి రూ.330కు పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అందుబాటులో ఉండాలంటే దిగుమతులు తప్పనిసరిగా మారాయని చెప్పారు.
అయితే ప్రస్తుతం పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం ఉండటం పరిశ్రమపై మరింత భారం పెడుతోందని విజయ్ పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్‌టైల్ పరిశ్రమేనని, ముఖ్యంగా మహిళల ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
పత్తి దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తే ముడి సరుకు కొరత తగ్గడంతో పాటు ప్రపంచ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే లక్షలాది ఉద్యోగాలు కూడా రక్షించబడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే 0 శాతానికి తగ్గించాలని ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి కీలక లేఖ రాశారు. దేశంలోని టెక్స్‌టైల్ రంగాన్ని, ముఖ్యంగా లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు పత్తిపై ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. పత్తి, నూలు ధరలు భారీగా పెరగడంతో టెక్స్‌టైల్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

